Friday, September 20, 2024
Homeక్రైంరైలుతో స్టంట్ చేస్తూ, కాలు చేయి పోగొట్టుకున్నాడు

రైలుతో స్టంట్ చేస్తూ, కాలు చేయి పోగొట్టుకున్నాడు

Date:

సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ కోసం చాలా మంది యువ‌తీ, యువ‌కులు వింత‌, వింత ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తుంటారు. అలాంటిది కదులుతున్న రైలును మస్జిత్‌ షా యువకుడు రెండు చేతులతో పట్టుకొని స్టంట్లు చేస్తూ కనిపించాడు. అలా చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక కాలు, చేయి కోల్పోయాడని తెలుపుతూ యువకుడికి సంబంధించిన క్లిప్‌ను రైల్వే పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఇటీవల యువకుడి స్టంట్స్‌ వీడియో వైరల్‌గా మారడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారని, అదుపులోకి తీసుకోవడానికి వెళ్లగా ఒక కాలు, చేయి కోల్పోయిన స్థితిలో కనిపించాడని అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 14న రైల్వే స్టేషన్‌లో రీల్స్‌ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక చేయి, కాలు కోల్పోయానని తెలిపాడు.

యువత ప్రమాదకర స్టంట్లు చేయకుండా నివారించేందుకు మస్జిత్‌ షా ఘటన ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ పేర్కొన్నారు. రైళ్లు, రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఎవరైనా ఇటువంటి స్టంట్లు చేస్తే వెంటనే 9004410735 లేదా 139 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. పోస్ట్‌ వైరల్‌గా మారడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘రీల్స్‌ మాయలో ఎంతో మంది యువత ఇలా ప్రమాదాల బారిన పడుతున్నా..మిగిలిన వారు తమ వైఖరిని మార్చుకోవట్లేదు’ అంటూ ఓ నెటిజన్‌ స్పందించారు. మరొకరు స్పందిస్తూ ‘ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి..జైలు శిక్ష విధించాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.