స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంచెజ్ సతీమణిపై ఆరోపణలు రావడంతో దేశ ప్రధానికే సమన్లు అందాయి. ఆయన సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంచెజ్ సతీమణి బెగొనా గోమెజ్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. తాను నడుపుతోన్న యూనివర్సిటీ మాస్టర్ డిగ్రీ కోర్సుకు స్పాన్సర్ల కోసం ప్రధాని సతీమణి హోదాను ఉపయోగించుకున్నారంటూ గోమెజ్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో సాక్షిగా ప్రధానిని ప్రశ్నించేందుకు విచారణాధికారులు సమన్లు ఇచ్చారు. అధికారిక నివాసంలో జులై 30న ఆయన్ను న్యాయమూర్తి ప్రశ్నించనున్నారు. ఆయన సాక్ష్యం ఈ కేసుకు కీలకం కానుందని పేర్కొన్నారు.
ఇటీవల గోమెజ్ విచారణకు హాజరైనా.. జడ్జి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. అలాగే తనపై వచ్చిన ఆరోపణలకు ఆమె ఇంతవరకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. పెడ్రో మాత్రం విపక్షాల విమర్శల్ని తోసిపుచ్చుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఆరోపణల కారణంగా ఏప్రిల్‌లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని భావించి, తన విధుల నుంచి ఐదు రోజులపాటు బ్రేక్ తీసుకున్నారు. కానీ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు.