Tuesday, October 8, 2024
HomeUncategorizedరాజ‌కీయాలు చేయ‌డానికి కాదు పార్ల‌మెంట్‌

రాజ‌కీయాలు చేయ‌డానికి కాదు పార్ల‌మెంట్‌

Date:

మ‌న‌కు పార్ల‌మెంట్ వేదిక ఉంది రాజ‌కీయాలు చేయ‌డానికి కాద‌ని.. దేశం కోసం ఉందని ప్రధాని మోడీ ప్రతిపక్షాలకు హితవు పలికారు. నేడు పార్లమెంట్‌ సమావేశాలకు ముందు ఆయన మాట్లాడుతూ ”మనం 2029 ఎన్నికల్లో మరోసారి తలపడదాం. అప్పటివరకు పార్లమెంట్‌ను మహిళలు, రైతులు, యువత జీవితాలను బాగు చేసేందుకు వాడదాం” అని పేర్కొన్నారు. సభలో నిరంతరం గందరగోళం వల్ల కొందరు సభ్యులు తమ పాయింట్లను చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చేశారని చెప్పిన మోడీ.. ఇక ఆ రాజకీయాల నుంచి పార్టీలు బయటకువచ్చి దేశం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈసారి ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌ అత్యంత కీలకమైందని ప్రధాని మోడీ అభివర్ణించారు. వచ్చే ఐదేళ్లకు తమకు కార్యనిర్దేశం చేసేదిగా ఈ బడ్జెట్‌ ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు.. వికసిత్‌ భారత్‌కు ఇది పునాది వేస్తుందని చెప్పారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత మూడోసారి ఒకే ప్రభుత్వం అధికారం చేపట్టిందన్నారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను సమర్పించేందుకు పార్లమెంటు సోమవారం నుంచి సమావేశమైంది. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. మంగళవారం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం ఆరు బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. కాగా, నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, రైల్వే భద్రత, కావడి (కన్వర్‌) యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని ఐక్యంగా నిలదీయాలని విపక్షం భావిస్తోంది. మరోవైపు బడ్జెట్‌ సమావేశాల కార్యాచరణపై చర్చించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన ప్రభుత్వం దీనిని నిర్వహించింది.