Wednesday, December 25, 2024
Homeఅంతర్జాతీయంఅన్నం కావాలంటే సైనికుల లైంగిక కోరిక తీర్చాలి

అన్నం కావాలంటే సైనికుల లైంగిక కోరిక తీర్చాలి

Date:

ఆక‌లితో ఆలమ‌టించే మ‌హిళ‌ల‌కు బుక్కెడు అన్నం కావాలంటే ముందుగా సైనికుల లైంగిక వాంఛలు తీర్చాలి. అప్పుడే వారికి ఆహారం లభిస్తుంది. ఆఫ్రికా దేశమైన సూడాన్‌లోని ఒమ్దుర్‌మన్‌ పట్టణంలోని కొందరు మహిళల దుస్థితి ఇది. ది గార్డియన్‌ పత్రిక దీనిపై కథనం ప్రచురించింది. ఈ పట్టణంలో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల చాలామంది పారిపోగా.. దాదాపు 24 మంది మహిళలు వారి కుటుంబాలతో సహా చిక్కుకుపోయారు. ఇక్కడ ఆహారం కేవలం సైన్యం వద్ద మాత్రమే లభిస్తోంది. ఇక్కడ ఫ్యాక్టరీల్లోనే వారు అత్యధిక ఆహార నిల్వలు ఏర్పాటుచేశారు. ఇంట్లోని వృద్ధ తల్లిదండ్రులు, పిల్లలకు ఆహారం తీసుకొనేందుకు వచ్చిన మహిళలతో సైనికులు లైంగిక వాంఛలు తీర్చుకొంటున్నారు. ఈ విషయాన్ని బాధిత మహిళలే స్వయంగా మీడియాకు వెల్లడించారు.

గతేడాది ఏప్రిల్‌ నెలలో అంతర్యుద్ధం మొదలైన తొలినాళ్ల నుంచే ఈ పరిస్థితి నెలకొంది. అప్పట్లో సైన్యం, ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ మధ్య ఘర్షణ ఈ సివిల్ వార్‌కు దారితీసింది. రెండు వర్గాలు తమను లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళలు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు.. ఖాళీ ఇళ్లల్లో మిగిలిపోయిన వస్తువులను తీసుకోవాలన్నా మహిళలు సైనికుల కోర్కెలు తీర్చాల్సిందే. ”ఇటువంటి పరిస్థితి పగవాళ్లకు కూడా వద్దు. కేవలం నా బిడ్డల ఆకలి తీర్చడానికే నేను వారు చెప్పినట్లు చేయాల్సివచ్చింది” అని ఓ మహిళ ది గార్డియన్‌ పత్రిక వద్ద వాపోయింది. కొందరు సైనికులు పాడుబడిన ఇళ్ల వద్దకు మహిళలను తీసుకొచ్చి వరుసగా నుంచోపెట్టి.. నచ్చినవారిని ఎంచుకొంటున్న దృశ్యాలను తాము చాలా చూశామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21 ఏళ్ల ఓ మహిళ సైనికులు చెప్పినట్లు చేయడానికి అంగీకరించకపోవడంతో ఆమె కాళ్లకు నిప్పుపెట్టారని స్థానికులు వివరించారు.