Thursday, November 7, 2024
HomeUncategorizedఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అవినీతిపరుడు

ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అవినీతిపరుడు

Date:

జేఎంఎం నేత, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అవినీతి పరుడని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవికి హేమంత్‌ సోరెన్‌ బుధవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈడీ అధికారులు ఆయన నివాసానికి చేరుకుని 7 గంటలపాటు ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో హేమంత్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ”జీవితమంటేనే గొప్ప యుద్ధం. ఈ పరిణామాన్ని నేను విరామంగా భావిస్తున్నా. ఇప్పటివరకు ప్రతి క్షణం ప్రజల కోసం పోరాడాను. ఇక ముందు కూడా కొనసాగిస్తా. ఏ విషయంలోనూ రాజీ పడను. ఓటమిని అస్సలు అంగీకరించను. ఈ ప్రయాణంలో గెలిచినా.. ఓడినా భయపడను. ప్రజలు పడుతున్న బాధను వృథా కానివ్వను” అంటూ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఆయన పోస్టు చేశారు.

దీనిపై కేంద్రమంత్రి రిజిజు స్పందిస్తూ.. ”నేనూ వెనుకబడిన ప్రాంతానికి చెందిన గిరిజన వ్యక్తినే. ప్రజాధనాన్ని దోచుకునే హక్కు ఏ గిరిజనుడికీ లేదు. హేమంత్ తండ్రి శిబు సోరెన్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే వాటిని అంగీకరించగలను. కానీ, పరువు తీసిన కుమారుడు ఇలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది” అని ఎద్దేవా చేశారు. హేమంత్‌ రాజీనామా అనంతరం జేఎంఎం సీనియర్‌ నేత చంపయీ సోరెన్‌ను సంకీర్ణ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కొత్త సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.