Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో కొన‌సాగుతున్న తీవ్ర‌ ఉద్రిక్త‌త‌లు

బంగ్లాదేశ్‌లో కొన‌సాగుతున్న తీవ్ర‌ ఉద్రిక్త‌త‌లు

Date:

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించాలంటూ విద్యార్థులు చేస్తోన్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న పలువురు భారత విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటివరకు సుమారు 1000 మంది విద్యార్థులు వచ్చారు. వారిలో 778 మంది సరిహద్దు మార్గాల ద్వారా రాగా, మరో 200 మంది విమానాల్లో సొంత దేశానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఎక్స్‌(ట్విటర్) వేదికగా వెల్లడించారు.

అంతర్జాతీయ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌ చేరుకుంటున్న విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ఢాకాలోని భారత హై కమిషన్ అన్ని సదుపాయాలు కల్పిస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నిమిత్తం పౌర విమానయాన శాఖ, సరిహద్దు భద్రతా దళంతో సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించింది. ఇప్పటికే దాదాపు 1000 మంది విద్యార్థులు స్వదేశానికి రాగా.. ఇంకా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్న 4వేల మంది విద్యార్థులతో హై కమిషన్‌ కాంటాక్ట్‌లో ఉంది. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 100 మందికి పైగా మృతిచెందినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. సైన్యాన్ని రంగంలోకి దించారు. పలు చోట్ల పెద్దఎత్తున ఆర్మీ బలగాలను మోహరించారు. దాంతో విమాన టికెట్లు బుక్‌ చేసుకున్న వారు.. విమానాశ్రయాలకు చేరుకోవడం కష్టంగా మారింది. కర్ప్యూ నేపథ్యంలో కొన్ని సంస్థలు విమాన సేవల్ని రద్దు చేశాయి.