Saturday, November 16, 2024
HomeUncategorizedములుగు జిల్లాలో అత్య‌ధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదు

ములుగు జిల్లాలో అత్య‌ధికంగా వ‌ర్ష‌పాతం న‌మోదు

Date:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. కుండ‌పోత వాన‌ల‌కు వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండ‌లా మారాయి. నిన్న రాత్రి నుంచి వ‌ర్షం కురుస్తోనే ఉంది. అయితే ఈ వారాంతంలో తెలంగాణ‌ రికార్డు వ‌ర్ష‌పాతాన్ని న‌మోదు చేసింది. శ‌నివారం రేపు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రించారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. సింగ‌రేణిలో బొగ్గు ఉత్ప‌త్తి నిలిచిపోయింది. ప‌లు ప్రాంతాల్లో రోడ్ల‌పై వ‌ర‌ద నీరు ప్ర‌వహిస్తుండ‌డంతో వాహ‌నాల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. విద్యుత్ స‌ర‌ఫ‌రా కూడా నిలిచిపోయింది. దీంతో స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్ర‌కారం.. ములుగు జిల్లాలోని వెంక‌టాపురంలో అత్య‌ధికంగా 109 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఆ త‌ర్వాత భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని చ‌ర్ల‌లో 96.8 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, మ‌హ‌బూబాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి, భూపాలప‌ల్లి, క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ జిల్లాల్లో 40 నుంచి 80 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

వాయుగుండం ప్ర‌భావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ప్ర‌ధానంగా ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల‌, నిర్మ‌ల్, పెద్ద‌ప‌ల్లి, నిజామాబాద్, జ‌గిత్యాల‌, సిరిసిల్ల‌, క‌రీనంగ‌ర్, భూపాల‌ప‌ల్లి జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. రాబోయే 18 గంట‌ల్లో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.