Friday, September 20, 2024
HomeUncategorizedమేడారం జాతరకు ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు

మేడారం జాతరకు ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు

Date:

తెలంగాణలో మేడారం సమ్మక్క, సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది. ఇక్కడ జాతర సందడి ఇప్పటికే మొదలైంది. ఈ జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈ జాతరకు వనదేవతలను చూసేందుకు భక్తులు తండోపతండాలుగా మేడారానికి పోటెత్తుతారు. ఇక, తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ మేడారం జాతర ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. నాలుగురోజులపాటు ఈ జాతరను నిర్వహిస్తారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్‌టిసి శుభవార్తను అందించింది. మేడారం జాతరకు వెళ్లేవారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

ఇప్పటికే తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించిన విషయం తెలిసిందే. ఇక మేడారం సందర్భంగా కూడా మహిళకు ప్రీ బస్ ప్రయాణం ఉన్నట్లు సమాచారం. అయితే, మేడారం జాతరకు వెళ్లే భక్తులందరి కోసం ఆర్‌టిసి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 6వేల ప్రత్యేక బస్సులను నడిపేందుకు రంగం సిద్ధంచేసింది. తెలంగాణలో జరిగే ఈ మేడారం జాతరను కుంభమేళా అని పిలుస్తారు. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు స్పెషల్ బస్సులను నడిపేందుకు ఆర్‌టిసి రంగం సిద్ధంచేస్తోంది.

మేడారం జాతరకు వెళ్లేవారి కోసం ఉమ్మడి ఖమ్మం డిపోల నుంచి 400 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్‌టిసి ప్రయత్నం చేస్తోంది. వీటితో పాటు సత్తుపల్లి డిపో నుంచి వెంకటాపురం, ఏటూరునాగారం, చర్ల వరకు 24 బస్సులు నడేపే ఆలోచనలో ఉంది. మణుగూరు డిపో నుంచి మణుగూరు, మంగపేటకు 20 బస్సులు నడిపేలా ఆర్‌టిసి ప్రణాళికలు వేస్తోంది. కొత్తగూడెం డిపో నుంచి కొత్తగూడెం, టేకులపల్లికి 155 బస్సులు నడుస్తున్నట్లు సమాచారం. మదిర డిపో నుంచి పాల్వంచ, ఖమ్మం నుంచి 35 బస్సులు నడపనున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం నుండి 128 బస్సులు. డిపో నుంచి మేడారం వరకు 38 బస్సులు నడిపేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఇక, ఈ వివరాలను త్వరలోనే ఆర్‌టిసి అధికారులు విడుదల చేయనున్నారు.