Monday, October 7, 2024
Homeక్రైందొంగిలించిన వ‌స్తువుల‌ను తిరిగిఇచ్చిన దొంగ

దొంగిలించిన వ‌స్తువుల‌ను తిరిగిఇచ్చిన దొంగ

Date:

ఒక ఇంటికి తాళం వేయడంతో దొంగ దొంగ‌త‌నానికి వెళ్లాడు. తీరా దొంగతనం చేశాక ఆ నివాసం ప్రముఖ రచయితదని తెలుసుకుని పశ్చాత్తాపం చెందాడు. దీంతో దొంగలించిన వస్తువులు తిరిగి ఇచ్చేసి, యజమానిని క్షమించమని కోరుతూ నోట్‌ రాసి పెట్టాడు. ఈ విచిత్రమైన సంఘటన మహరాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రముఖ మరాఠీ కవి, సామాజికవేత్త నారాయణ్ సువే 2010లో కన్నుమూశారు. ప్రస్తుతం ఇంట్లో కుమార్తె సుజాత, ఆమె భర్త గణేష్‌ ఘారే నివసిస్తున్నారు. వారు విరార్‌లోని కుమారుడి వద్దకు వెళ్లడంతో 10 రోజులు ఇంటికి తాళం వేసి ఉంది. ఇదే అదునుగా భావించిన ఒక దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించి ఎల్‌ఈడీ టీవీతో పాటు పలు విలువైన వస్తువులను దొంగలించాడు. మరిన్ని వస్తువుల కోసం మరుసటి రోజు అదే ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ ఇంట్లో నారాయణ్‌ ఫోటో, జ్ఞాపికలు కనిపించాయి. దీంతో ఆ దొంగ పశ్చాత్తాపం చెంది ముందు దొంగలించిన వస్తువులని తిరిగి ఆ ఇంటిలోనే పెట్టేశాడు. గొప్ప సాహితీవేత్త ఇంట్లో దొంగతనం చేసినందుకు క్షమించాలని కోరుతూ యజమానికి నోట్‌ రాసి గోడకు అతికించాడు. సుజాత, ఆమె భర్త విరార్‌ నుంచి తిరిగి వచ్చాక నోట్‌ను చూసి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు టీవీ సెట్‌పై లభించిన వేలిముద్రల అధారంగా విచారణ చేపట్టారు. నారాయణ్‌ ముంబయిలో అనాథగా పెరిగారు. కూలి పనులు చేసుకుంటూనే చదవడం, రాయడం నేర్చుకున్నారు.ఆయన రెండో తరగతి మాత్రమే చదువుకున్నప్పటికీ మరాఠీ భాషాలోని ఉత్తమ రచయితల్లో ఒకరిగా పేరొందారు. పట్టణ శ్రామిక వర్గంపై రచనలు చేశారు. రష్యా నుంచి సోవియట్‌ ల్యాండ్‌ నెహ్రూ, భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీతో పాటు అనేక అవార్డులు అందుకున్నారు.