Monday, October 7, 2024
HomeUncategorizedఅమ్మా అని పిలిచే నా బిడ్డ గొంతు ఆగిపోయిందా..

అమ్మా అని పిలిచే నా బిడ్డ గొంతు ఆగిపోయిందా..

Date:

దేశంకోసం ప‌నిచేస్తాన‌ని వెళ్లిన నా బిడ్డ ఆశ‌ల‌న్నీ ఆవిర‌య్యాయి.. న‌న్ను ఇంక నోరారా అమ్మ అని పిలిచే గొంతు మూగ‌బోయింది. తన బిడ్డ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశాడన్న ఆత్మ సంతృప్తి. జమ్ముకశ్మీర్‌లోని డోడా ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన కెప్టెన్‌ బ్రిజేశ్‌ థపా తల్లి ఆవేదన.. అక్కడి వారి కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగేలా చేస్తోంది.

తన బిడ్డను పొట్టన పెట్టుకొని.. ఇంత క్షోభకు గురిచేసిన ఉగ్రవాదులపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలంటూ విలపిస్తున్న తీరు.. ఆమె దేశభక్తిని చాటి చెబుతోంది. ముష్కరుల దాడిలో 27 ఏళ్ల బ్రిజేశ్‌ ప్రాణాలు కోల్పోవడంతో అతడి స్వగ్రామం పశ్చిమబెంగాల్‌లోని సిలిగుడిలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎలాగైనా ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

పెళ్లి ముచ్చట తీరకుండానే..

బ్రిజేశ్‌ ఐదేళ్ల క్రితమే సర్వీసులో చేరారు. ఆయనకు ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులు, బంధువులు ఈ మధ్యనే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సరైన సంబంధం కోసం వెతుకుతున్నారు. ఇంతలోనే ఈ ఘోరం చోటు చేసుకోవడంతో తల్లిదండ్రుల్ని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. కుటుంబంలో బ్రిజేశ్‌ లేని లోటు ఎవరూ తీర్చలేరని, భగవంతుడు వారికి పుత్రశోకాన్ని మిగిల్చాడని బంధువులు వాపోతున్నారు.

ముష్కరుల దాడిలో బ్రిజేశ్‌తోపాటు, నాయక్‌ రాజేశ్‌, సిపాయి బ్రిజేంద్ర, అజయ్‌ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. అమరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి త్యాగాలు వృథా కావని అన్నారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ కొనసాగుతోందని చెప్పిన.. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, జమ్ముకశ్మీర్‌ ప్రాంతంలో శాంతిని కాపాడేందుకు సైనికులు అండగా ఉన్నారని అన్నారు.