Monday, October 7, 2024
HomeUncategorizedత్వ‌ర‌లో ఆన్‌లైన్‌లో బీర్‌, వైన్, లిక్క‌ర్‌

త్వ‌ర‌లో ఆన్‌లైన్‌లో బీర్‌, వైన్, లిక్క‌ర్‌

Date:

అంతా ఇంట‌ర్నెట్ కాల‌మైపోయింది.. ఇంట్లో కూర్చోని ఏది కావాల‌న్నా క్ష‌ణాల్లో ఆన్‌లైన్ ద్వారానే తెప్పించుకుంటున్నారు. ఫుడ్‌ నుంచి గ్రాసరీస్‌ వరకూ ఆన్‌లైన్‌లోనే క్ష‌ణాల్లో వ‌చ్చేస్తోంది. ఇదే ఆసరాగా చేసుకొని పలు ఆన్‌లైన్‌ సంస్థలు ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలను అన్వేశిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్‌ను చెప్పాయి. స్విగ్గీ, జొమాటో, బిగ్‌ బాస్కెట్‌ వంటి యాప్స్‌ త్వరలో బీర్‌, వైన్‌, లిక్కర్‌ వంటి తక్కువ ఆల్కహాల్‌ డ్రింక్స్‌ను హోమ్‌ డెలివరీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.

ఈ సంస్థలు కొన్నేళ్ల క్రితం కేవలం ఫుడ్‌ మాత్రమే ఆన్‌లైన్‌లో డెలివరీ చేసేవి. ఆ తర్వాత కిరాణా సరకులు, కూరగాయలు వంటికి కూడా సరఫరా చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి ఆల్కహాల్‌ను కూడా డోర్‌ డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ముందుగా ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్‌, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. మద్యం దుకాణాలకు వచ్చి కొనుగోలు చేయలేని వారి కోసం ఇలాంటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 2020 కరోనా సమయంలో లాక్‌డౌన్‌ విధించిన వేళ మహారాష్ట్ర, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, అస్సాం ప్రాంతాల్లో మద్యం హోమ్‌ డెలివరీకి అనుమతించారు. అయితే అందుకు కొన్ని షరతులు విధించారు. ఇప్పటికే మద్యం హోమ్‌ డెలివరీ అనుమతి ఉన్న ఒడిషా, పశ్చిమబెంగాల్‌లో ఈ విధానం తీసుకురావడం వల్ల మద్యం అమ్మకాలు 20-30 శాతం పెరిగాయని నివేదికలు వెల్లడించాయి.