Sunday, October 6, 2024
HomeUncategorizedత‌మ భూమిని 'ముడా' అక్ర‌మంగా లాక్కొంది

త‌మ భూమిని ‘ముడా’ అక్ర‌మంగా లాక్కొంది

Date:

తన భార్య పరిహారం పొందేందుకు అర్హురాలని, తమ భూమిని మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) అక్రమంగా లాక్కుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. విపక్ష నాయకులవి అర్థం లేని ఆరోపణలు అని తోసిపుచ్చారు. ఈసందర్భంగా ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. మైసూరులోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య సతీమణికి మూడు ఎకరాల భూమి ఉండేది. దానిని ఆమె సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా ‘ముడా’ దానిని స్వాధీనం చేసుకుంది. పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. కెసరెలోని ల్యాండ్‌తో పోలిస్తే.. విజయనగరలో భూమి మార్కెట్‌ ధర చాలా ఎక్కువగా ఉంది. అదే భాజపా విమర్శలకు కారణమైంది. ఆ పార్టీ హయాంలోనే ఈ కేటాయింపు జరిగింది.

2014లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పరిహారం కోసం దరఖాస్తు చేసుకుందని గుర్తు చేశారు. అయితే తాను సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పానన్నారు. దాంతో 2021లో మరో దరఖాస్తు చేసుకోగా.. అప్పటి భాజపా ప్రభుత్వం విజయనగరలో భూమి కేటాయించిందని వెల్లడించారు. మార్కెట్ ధర ఎక్కువగా ఉందని భాజపా భావిస్తే.. దానిని వెనక్కి తీసుకొని తన భార్యకు చెందాల్సిన పరిహారాన్ని ఇవ్వాలన్నారు.