Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయంప్ర‌తిరోజు ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా న‌వ్వాలి

ప్ర‌తిరోజు ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా న‌వ్వాలి

Date:

మ‌నిషి న‌వ్వుతే స‌గం రోగాలు న‌య‌మ‌వుతాయి అంటారు.. న‌వ్వు మ‌నిషికి అన్ని విధాలా మంచి ఔష‌ధం.. అందుకే జ‌పాన్ ప్రభుత్వం ఆ దేశ ప్ర‌జ‌ల కోసం కొత్త చ‌ట్టం తీసుకువ‌చ్చింది. జ‌పాన్ ప్ర‌జ‌లు ప్రతి రోజూ అందరూ త‌ప్ప‌కుండా నవ్వాలని ఆ చ‌ట్టంలో రూపొందించారు. యమగట ప్రిఫెక్చర్‌ ప్రభుత్వం ‘లాఫింగ్‌ లా’ని తీసుకొచ్చింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పౌరుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవ్వడం ఆరోగ్యానికి మంచిది అంటారు. ఈ క్రమంలో యమగట విశ్వవిద్యాలయంలోని ‘ఫ్యాక్టరీ ఆఫ్‌ మెడిసిన్‌’ చేసిన పరిశోధనల్లో తక్కువగా నవ్వే వారిలో కొంతమంది వివిధ వ్యాధులతో మరణిస్తున్నారని తేలింది. ఈ పరిశోధన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రోజులో ఒక్కసారి తప్పకుండా నవ్వాలని చట్టం తీసుకొచ్చింది. పని ప్రదేశంలో నవ్వుతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహించాలంటూ కంపెనీలను కూడా ఆదేశించడం విశేషం. ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని సూచించింది.

అయితే, ఈ చట్టంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నవ్వొస్తే నవ్వుతారు కానీ కచ్చితంగా రోజులో ఒకసారైనా నవ్వాల్సిందేనని చట్టం తేవడమేంటి అని జపాన్ కమ్యూనిస్టు పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల కొంతమంది నవ్వలేకపోవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి చట్టాలతో ప్రజల హక్కులను కాలరాయొద్దని తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే, విమర్శలను అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కొట్టిపారేసింది. నవ్వడం ప్రజల ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపింది. అందుకే నవ్వకపోతే జరిమానా విధిస్తాం వంటి అంశాలను చట్టంలో పొందుపరచలేదని వివరించింది.