Sunday, October 6, 2024
HomeUncategorizedతెలంగాణ‌లో బ్ర‌హ్మ‌ణి చేతికే టిడిపి పగ్గాలు..?

తెలంగాణ‌లో బ్ర‌హ్మ‌ణి చేతికే టిడిపి పగ్గాలు..?

Date:

తెలంగాణ‌లో మ‌ళ్లీ టిడిపి చ‌క్రం తిప్పుతోంది.. ఇన్ని రోజులు మూల‌కు ప‌డ్డ సైకిల్‌ను ముందుకు తెచ్చి వేగంతో పుంజుకునేలా చంద్ర‌బాబు క‌స‌ర‌త్తులు మొద‌లెట్టిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వేరే పార్టీలతో సంబంధం లేకుండానే టీడీపీ సింగిల్‌గానే 135 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టింది. ఏపీలో పార్టీ విజయం సాధించడంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని గాడిలో పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఇటీవలే హైదరాబాద్‌కు విచ్చేశారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టడంతో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. చాలాకాలం తర్వాత ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న చంద్రబాబు తెలంగాణ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. తెలంగాణలోనూ పార్టీని మళ్లీ ట్రాక్ మీదకు తీసుకువస్తానని తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణలో మూలకు పడిన సైకిల్‌ను తిరిగి రేస్‌లో తెచ్చేందుకు చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

దీనిలో భాగంగానే తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి పరుగులు పెట్టించే బాధ్యతను తన కోడలికి అప్పగించబోతున్నారని తెలంగాణ టీడీపీలో వినిపిస్తోంది. బ్రాహ్మణిని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే ఆలోచనలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. నారా లోకేష్ ఏపీలో మంత్రిగా ఉండటంతో, తెలంగాణ బాధ్యతలను బ్రాహ్మణికి ఇవ్వడమే సమంజసమని బాబు ఆలోచనగా తెలుస్తోంది.

మొదట వేరే వ్యక్తికి తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని భావించినప్పటికి..ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలు నారా బ్రాహ్మణికి ఇవ్వడమే కరెక్ట్ అని , ఆమెకు పగ్గాలు ఇస్తేనే టీడీపీకి పునర్వైభవం వస్తోందని చంద్రబాబు ఆలోచించారట. ఈక్రమంలోనే వ్యూహాత్మకంగా నారా బ్రాహ్మణి తెర మీదకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. పార్టీని పునరేకీకరణ చేసేందుకు బ్రాహ్మణికి కీలక రోల్ ఇవ్వాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు నారా లోకేశ్, బాలకృష్ణ సైతం సుముఖత వ్యక్తం చేశారని, ప్రస్తుతం ఇదే విషయంపై తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ నెల 19న చంద్రబాబు మళ్లీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆ సమయంలో నారా బ్రాహ్మణికి పార్టీ బాధ్యతల గురించి చంద్రబాబు నాయకులతో చర్చించే అవకాశం కనిపిస్తోంది.