Sunday, October 6, 2024
HomeUncategorizedపురుషుడిగా మారిన మ‌హిళ IRS అధికారిణి

పురుషుడిగా మారిన మ‌హిళ IRS అధికారిణి

Date:

ఒక మ‌హిళ ఐఆర్ఎస్ అధికారిణి దేశ చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన లింగం, పేరును మార్పు చేయించుకున్నారు. పుట్టుకతో స్త్రీగా పరిగణించిన తనను ఇకపై పురుషుడిగా గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను అభ్యర్థించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చైన్నెకు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి ఎం.అనసూయ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్‌ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ (అధీకృత ప్రతినిధి) కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆమె తన పేరును ఎం.అనుకతిర్‌ సూర్యగా, లింగాన్ని స్త్రీకు బదులుగా పురుషుడిగా మార్చాలని ఆర్థిక మంత్రిత్వశాఖను కోరారు.

దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఈవిధంగా పేర్కొంది. “ఇటీవల మాకు ఓ విన్నపం అందింది. 2013 బ్యాచ్ కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారిణి అనసూయ ప్రస్తుతం హైదరాబాద్‌లోని CESTAT చీఫ్ కమిషనర్ (AR) కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తనకు సంబంధించిన అన్ని ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన పేరును, లింగాన్ని మార్చాల్సిందిగా అభ్యర్థించారు. అన్ని అధికారిక రికార్డుల్లో మార్పులు చేసి ఇకపై ఆమెను పురుషుడిగా పరిగణిస్తున్నాం” అని వెల్లడించింది.

లింగ మార్పిడికి సంబంధించిన నల్సా కేసు 2014లో సుప్రీంకోర్టు ముందుకువచ్చింది. ఒడిశాకు చెందిన ఓ వాణిజ్య పన్ను అధికారి విధుల్లో చేరిన ఐదేళ్ల అనంతరం తాను లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నానని తనను స్త్రీగా గుర్తించాలని కోరారు. ఈ కేసులో సుప్రీం తీర్పును వెల్లడిస్తూ వ్యక్తులు తాము పురుషులుగా ఉండాలా, స్త్రీగా ఉండాలా అనేది వారి వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించడంతో ఆ అధికారి తన పేరును ఐశ్వర్య రీతుపర్ణ ప్రధాన్‌గా అధికారిక రికార్డుల్లో మార్చుకున్నారు.

చెన్నైకు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి అనసూయ చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. 2013లో చెన్నెలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా తన వృత్తిని ప్రారంభించిన ఐఆర్‌ఎస్‌ అధికారి అనసూయ 2018లో డిప్యూటీ కమిషనర్ ర్యాంక్‌కు పదోన్నతి పొందారు. 2023లో భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా చేశారు. గత ఏడాది హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్‌ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా విధుల్లో చేరారు.