Wednesday, December 25, 2024
Homeఅంతర్జాతీయంప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంటున్న నేర‌గాళ్లు

ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంటున్న నేర‌గాళ్లు

Date:

చట్టం నుంచి తప్పించుకోవడానికి నేరగాళ్లు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంటున్నారు. వారి రూపురేఖలు మార్చేందుకు ఏకంగా రహస్య ఆస్పత్రులనే నిర్వహిస్తున్నారు. కుంభకోణాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడినవారు అరెస్టు నుంచి తప్పించుకొనేలా ప్లాస్టిక్‌ సర్జరీలు నిర్వహిస్తున్నారు.

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా దక్షిణ శివార్లలోని పాసే అనే పట్టణంలో మే నెలలో పోలీసులు రైడ్‌ చేశారు. అక్కడ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ టూల్స్‌, డెంటల్‌ ఇంప్లాంట్స్‌, స్కిన్‌ వైట్‌నింగ్‌ ఐవీ డ్రిప్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు. వీటి సాయంతో ఓ మనిషి రూపురేఖలు పూర్తిగా మార్చేయవచ్చని ప్రెసిడెన్షియల్‌ యాంటీ ఆర్గనైజ్డ్‌ క్రైం అధిపతి జాన్‌ కాసియో పేర్కొన్నారు. ఇక్కడ ముగ్గురు డాక్టర్లను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు వియత్నాం వాసులు కాగా.. ఒకరు చైనా పౌరుడు. వారికి అక్కడ పని చేయడానికి అనుమతులు లేవు. మరో రెండు అక్రమ ఆసుపత్రులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిఘా పెట్టారు. ఇవి పాసే పట్టణంలోని వైద్యశాల కంటే నాలుగు రెట్లు పెద్దవని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే పేషెంట్ల గుర్తింపుకార్డులను ఎవరూ అడగరని అధికారులు చెబుతున్నారు. ఇక్కడికొచ్చే క్లైయింట్లలో ఎక్కువమంది ఆన్‌లైన్‌ కేసినోలకు చెందినవారని, దీంతోపాటు ఫిలిప్పీన్స్‌లో అక్రమంగా పనిచేస్తున్నవారు ఉన్నట్లు అధికారులు చెప్పారు. 2022లో చైనా మాఫియాగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని ఫిలిప్పీన్స్‌ అధికారులు అరెస్టు చేశారు. అతడు చట్టం నుంచి తప్పించుకొనేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకొన్నట్లు గుర్తించారు.