శాస్త్రసాంకేతిక రంగాల్లో ప్రస్తుతం విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, సైన్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో, అంతే స్థాయిలో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 13వ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. కొత్త సాంకేతికత వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అదే సమయంలో మానవాళికి అది సరికొత్త సవాళ్లను విసురుతుంది. ఉదాహరణకు క్రిస్పార్-క్యాస్9 సాంకేతికత వల్ల మానవుల జన్యువులల్లో మార్పులు చేయడం చాలా సులభమైంది. ఎన్నో రకాల వ్యాధులను నయం చేసేందుకు సహకరించింది. అయితే, ఈ సాంకేతికత సామాజికంగా ఎన్నో రకాల సమస్యలు సృష్టించింది. అంతేకాకుండా ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన కృత్రిమమేధ వల్ల డీప్ ఫేక్ సమస్య ఎదురైంది. సాంకేతికతను సక్రమ మార్గంలో ఉపయోగించకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఊహించలేం” అని ద్రౌపది ముర్ము అన్నారు.
సైన్స్ హేతుబద్ధతకు సంప్రదాయ విలువలను జోడిస్తూ ఎన్‌ఐఎస్‌ఈఆర్ ముందుకు వెళ్తుండటం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. తమ వృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా, సమాజసేవ చేయాలని విద్యార్థులకు ఆమె సూచించారు. ”జాతిపిత మహాత్మాగాంధీ ఏడు సామాజిక రుగ్మతలు ఉంటాయని విశ్వసించేవారు. అందులో ‘దయలేని సైన్స్’ కూడా ఒకటి. జాలి, దయ, మానవత్వం గురించి ఆలోచించకుండా సైన్స్‌ని ప్రచారం చేయడం మహా పాపం. ప్రతి ఒక్కరూ దీనిని గుర్తుంచుకోవాలి” అని హితవు పలికారు. శాస్త్రపరిజ్ఞానంపై పరిశోధనలు చేసేందుకు చాలా ఓర్పు సహనం అవసరమని, ఫలితం రాబట్టేందుకు చాలా కాలం వేచి చూడాల్సి రావొచ్చని ముర్ము అన్నారు. అందువల్ల ఎప్పుడూ నిరుత్సాహ పడకుండా లక్ష్యం దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.