Sunday, October 6, 2024
HomeUncategorizedభక్తజనసంద్రంగా మారిన పూరి క్షేత్రం

భక్తజనసంద్రంగా మారిన పూరి క్షేత్రం

Date:

ఒడిశాలోని పూరి క్షేత్రం భక్తజనసంద్రంగా మారింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆదివారం ఆరంభమైన రథయాత్ర సోమవారం రెండోరోజూ కొనసాగుతున్నది. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర రెండురోజుల పాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1971లో రెండు రోజులపాటు రథయాత్ర జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ యాత్రను రెండు రోజుల పాటు నిర్వహించారు. ఈ నేపథ్యంలో చివరి రోజైన నేడు జగన్నాథుడిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగన్నాధ రథయాత్రతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. రష్యా నుంచి భారీ సంఖ్యలో భక్తులు పూరికి పోటెత్తారు. రథయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన రష్యా భక్తురాలు మీడియాతో మాట్లాడుతూ జగన్నాధ రథయాత్రలో పాల్గొనేందుకు తాము పలుమార్లు రష్యా నుంచి ఇక్కడకు వచ్చామని చెప్పుకొచ్చారు. జగన్నాధుడు కొలువుతీరిన ఈ పవిత్ర ప్రదేశానికి రావడం తమకు సంతోషంగా ఉందని అన్నారు.

రష్యాలో స్ధిరపడిన మరో భక్తురాలు హరిప్రియ మాట్లాడుతూ రథయాత్రలో పాల్గొనడం సంతోషకరమని, తాను ఇక్కడకు రావడం ఇది పదవసారని చెప్పారు. పూరి జగన్నాధుడి పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆమె తెలిపారు. కాగా, తొలి రోజు రథయాత్రలో అపశ్రుతి చోటచేసుకుంది. రథం లాగుతుండగా భక్తుల మధ్య జరిగిన స్వల్ప తోపులాటలో ఒకరు మరణించగా.. 300 మంది స్వ ల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే దవాఖానలకు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చే చెరాపహరా కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత బలభద్రుని తాళ ధ్వజ రథాన్ని ముందుకు నడిపిస్తుండగా జరిగిన తోపులాటలో ఒక భక్తుడు మరణించాడు.