ఉక్రెయిన్ ప్రభుత్వం తొలిసారిగా జైల్లోని ఖైదీలనూ మిలటరీలోకి తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేస్తోంది. మాస్కోకు వ్యతిరేకంగా యుద్ధంలో చేరుతామనే వారిపై కేసులు కొట్టేసి జైలు నుంచి విడుదల చేస్తామని ఉక్రెయిన్ ఆర్మీ ఖైదీలకు ఆఫర్ ఇచ్చింది. ”ఈ నిర్బంధ జీవితానికి ముగింపు పలకండి. కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఇందుకోసం మీరు చేయాల్సింది ఒకటే..! మీ మాతృభూమిని కాపాడుకునేందుకు ఫ్రంట్‌లైన్‌లో పోరాడాలి” అని ఆర్మీ రిక్రూటర్లు ఖైదీల్లో ప్రేరణ నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఖైదీలను విడుదల చేసి వారిని సైన్యంలో తీసుకునేందుకు ఉక్రెయిన్ గత నెల పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లును ఆమోదించింది. ఇప్పటికే 3000 మంది ఖైదీలను పైలట్ ప్రోగ్రామ్ కింద మిలిటరీ యూనిట్లలోకి తీసుకోగా.. ఇప్పుడు మరో 27 వేల మంది కోసం కొత్త రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్‌ను చేపట్టింది. ఖైదీలకు పడిన శిక్షను సమీక్షించి.. వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించిన తర్వాతే వారిని ఇంటర్వ్యూ చేస్తోంది. అత్యాచారం, హత్య వంటి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారిని అనర్హులుగా ప్రకటించింది. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఆర్మీ క్యాంప్‌ల్లో సాధారణ శిక్షణ ఇవ్వనుంది. ఆయుధాలను ఎలా పట్టుకోవాలి.. యుద్ధ పరికరాలను ఎలా ఉపయోగించాలి అన్నది నేర్పించిన తర్వాత యుద్ధ విధుల్లోకి పంపించనుంది. ఈ ప్రోగ్రామ్‌కు ఖైదీల నుంచి మంచి స్పందన వస్తోంది.