Wednesday, December 25, 2024
Homeఅంతర్జాతీయంఅంతరిక్షంలోనే చిక్కుకున్న సునీతా విలియమ్స్

అంతరిక్షంలోనే చిక్కుకున్న సునీతా విలియమ్స్

Date:

అంతరిక్షంలోకి బోయింగ్ స్టార్ లైనర్ నౌకతో వెళ్లిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తిరిగి భూమికి రావడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆమె వెళ్లిన స్టార్ లైనర్ నౌకలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా వెంటనే భూమికి తిరుగు ప్రయాణం కావడం కష్టంగా మారింది. దీంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దీనిపై తాజా అప్ డేట్ ఇచ్చింది. స్టార్ లైనర్ మిషన్ గడువును 45 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది. దీంతో సునీత ఇప్పట్లో భూమికి రావడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.

జూన్ ప్రారంభంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్టార్ లైనర్ నౌక.. హీలియం లీక్‌లు, థ్రస్టర్ అంతరాయాలతో సమస్యలను ఎదుర్కొంది. దీంతో అందులో అంతరిక్షానికి వెళ్లిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్‌లను భూమికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నిస్తోంది. స్టార్ లైనర్ నౌక భూమికి తిరిగివచ్చే కచ్చితమైన తేదీ చెప్పలేమని నాసా చెబుతోంది.

స్టార్ లైనర్ నౌకలో ఎదురైన సమస్యలను అధ్యయనం చేసేందుకు నాసా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మఖ్యంగా స్టార్ లైనర్ మొదటి దశలో కొన్ని థ్రస్టర్ లు ఎందుకు విఫలమయ్యాయో తాము ఇంకా పరిశీలిస్తున్నట్లు నాసా తెలిపింది. ఈ అధ్యయనం పూర్తి అయితే తప్ప స్టార్ లైనర్ నౌకను భూమికి తిరిగి వచ్చేందుకు తేదీని నిర్ణయించలేమని వెల్లడించింది. హడావిడిగా భూమికి స్టార్ లైనర్ ను తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నించడం లేదని పేర్కొంది. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మరికొంతకాలం అంతరిక్షంలోనే ఉండిపోవాల్సిన పరిస్దితి.