మిల్కీ బ్యూటీ తమన్నా జీవిత చరిత్రను కర్ణాటకలో పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాల్లో పెట్టారు. దీంతో ఈ విషయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరింపజేసే నటి తమన్నా జీవితం పిల్లల పాఠంగా ఉండటం వివాదాస్పదంగా మారింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడ ఫైర్ అవుతున్నారు. ఆమె ఏమైనా పోరాటయోధురాలా? అంటూ మండిపడుతున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో హెబ్బళ సింధీ అనే ఉన్నత పాఠశాల పుస్తకాల్లో 7th క్లాస్ పిల్లల పాఠ్యాంశంగా నటి తమన్నా భాటియా లైఫ్ స్టోరీ కనిపించింది. ఈ పాఠ్యాంశం మరేదో కాదు.. దేశ విభజన జరిగిన తర్వాత సింధీ వర్గానికి చెందిన కొందరి ప్రముఖుల గురించి చెప్పేది. అందువల్ల అదే సింధీ వర్గానికి చెందిన తమన్నా భాటియా, బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్‌ల గురించి ఆ పాఠ్య పుస్తకాల్లో లిఖించారు. దీంతో ఇది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమన్నారు.
ఒక హీరోయిన్ పిల్లలకు ఏవిధంగా ఆదర్శప్రాయురాలు అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా అక్కడి ప్రైవేటు పాఠశాలల సంఘాలు కూడా ఈ వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ వివాదం తీవ్ర దుమారం రేపడంతో కర్ణాటక విద్యాశాఖ స్పందించింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. విద్యాశాఖతో పాటు హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల యాజమాన్యం కూడా రియాక్ట్ అయింది. ఈ మేరకు సింధీ వర్గానికి చెందిన నటి తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించిందని.. అత్యున్నత స్థాయికి చేరడం ద్వారా తమన్నా జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టామని చెప్పుకొచ్చింది. అయితే ఇదే వ్యవహారంపై పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అయింది.