Wednesday, October 30, 2024
Homeక్రైంనిండు గర్భిణీ ప్రాణం తీసిన నకిలీ డాక్టర్లు

నిండు గర్భిణీ ప్రాణం తీసిన నకిలీ డాక్టర్లు

Date:

నకిలీ వైద్యుల తప్పుడు ఇంజెక్షన్‌ కారణంగా నిండు గర్భిణీ మరణించింది. కడుపులోని శిశువు కూడా చనిపోయింది. వైద్య దర్యాప్తులో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో నకిలీ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విక్రమ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల అంచల్‌కు నెలలు నిండాయి. దీంతో కాన్పు కోసం ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఆమెను అడ్మిట్‌ చేశారు. ఆసుపత్రి డాక్టర్లు వినయ్‌ కుమార్‌ పాండే, శివ్ బహదూర్ యాదవ్ ఆపరేషన్‌ కోసం రూ.50,000 కట్టించుకున్నారు. ప్రసవం కోసం అంచల్‌కు ఒక ఇంజెక్షన్‌ ఇచ్చారు. అస్వస్థతకు గురైన ఆమెతోపాటు కడుపులోని పిండం కూడా మరణించింది. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ లేదంటూ ఆ ఇద్దరు డాక్టర్లు అక్కడి నుంచి పారిపోయారు.

మరోవైపు తప్పుడు ఇంజెక్షన్‌ కారణంగా దళిత గర్భిణీ అంచల్‌ చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భదోహి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సంతోష్‌ కుమార్‌ దీనిపై దర్యాప్తు జరిపించారు. ఆ ప్రైవేట్‌ ఆసుపత్రికి ఎలాంటి లైసెన్స్ లేదని, డాక్టర్ల డిగ్రీలు నకిలీ అని గుర్తించారు. తప్పుడు ఇంజెక్షన్ కారణంగానే నిండు గర్భిణీ, ఆమె కడుపులోని పిండం మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నిర్ధారణ అయ్యింది. దీంతో నకిలీ డాక్టర్లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిద్దరి కోసం పోలీసులు వెతుకున్నారు.