Saturday, October 5, 2024
HomeUncategorizedనీట్‌ రద్దు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానం

నీట్‌ రద్దు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానం

Date:

తమిళనాడు అసెంబ్లీ నీట్‌ రద్దు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. నీట్‌ను రద్దు చేయాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. నీట్‌-యూజీ 2024 ఎగ్జామ్‌ పేపర్ లీక్, నీట్‌-పీజీ 2024 పరీక్షను ఆకస్మికంగా వాయిదా వేయడంపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొన్నది. ఈ తరుణంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ శుక్రవారం నీట్‌ రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మణితనేయ మక్కల్ కట్చి, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం, తమిళగ వెట్రి కజగం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సహా పలు ప్రాంతీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా మెడికల్ అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన నీట్ నుంచి మినహాయించాలన్న తమిళనాడు డిమాండ్‌ను డీఎంకే ఎంపీ కనిమొళి ఢిల్లీలో పునరుద్ఘాటించారు. ‘మాకు నీట్ వద్దు అని తమిళనాడు స్పష్టంగా చెబుతోంది. నీట్ సరైన పరీక్ష కాదని ఇప్పుడు రుజువైంది. నీట్ వల్ల విద్యార్థులు చాలా నష్టపోతున్నారు’ అని మీడియాతో ఆమె అన్నారు. గతంలో నీట్‌ మినహాయింపుతోపాటు తాజాగా నీట్‌ రద్దు చేయాలన్న తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిందని వెల్లడించారు.