Sunday, November 10, 2024
Homeఅంతర్జాతీయంఆన్‌లైన్‌ గేమ్‌లో గొడవపడిన గేమర్

ఆన్‌లైన్‌ గేమ్‌లో గొడవపడిన గేమర్

Date:

ఓ వ్యక్తి ఆన్‌లైన్‌ గేమ్‌లో గొడవ పడిన మరో గేమర్‌ను హతమార్చేందుకు ఏకంగా వందల కిలోమీటర్లు ప్రయాణించాడు. నేరుగా అతడి నివాసానికి వెళ్లి సుత్తితో యువకుడి తలను పగలగొట్టాడు. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళ్తే..

న్యూజెర్సీకి చెందిన ఎడ్వర్డ్‌ కాంగ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసగా మారాడు. గేమ్‌ ఆడుతున్న క్రమంలో మరో గేమర్‌తో ఏదో కారణంతో వాగ్వాదానికి దిగాడు. గొడవ కాస్తా ముదరడంతో కాంగ్‌ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ వ్యక్తిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అతడి వివరాలు తెలుసుకున్నాడు. స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నానని తల్లికి చెప్పి ఫ్లోరిడాకు బయలుదేరాడు. అలా 750 కిలోమీటర్లు ప్రయాణించి తోటి గేమర్‌ నివాసానికి చేరుకున్నాడు.

ఇంటి తలుపులు తెరచి ఉండడంతో లోనికి వెళ్లాడు. అప్పుడే గది నుంచి బయటకు వస్తున్న యువకుడి తలపై సుత్తితో బలంగా కొట్టాడు. ఇది గమనించిన బాధితుడి తండ్రి కాంగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణపాయం తప్పినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. ఇలాంటి ఘర్షణల నేపథ్యంలో యూరప్‌, నార్త్‌ అమెరికాలో తమ సర్వర్‌లను నిలిపివేస్తున్నట్లు సదరు గేమింగ్‌ సంస్థ ప్రకటించడం గమనార్హం.