Saturday, October 5, 2024
HomeUncategorizedలోక్‌సభలో జన గళాన్ని బలంగా వినిపిస్తాం

లోక్‌సభలో జన గళాన్ని బలంగా వినిపిస్తాం

Date:

18వ లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఎన్నికైన ఓం బిర్లాను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అభినందించారు. 18వ లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్‌ గాంధీ బుధవారం తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల గొంతుకను వినిపించేందుకు అనుమతించాలని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు చొరవ చూపాలని ఈ సందర్భంగా స్పీకర్‌ను కోరారు. 17వ లోక్‌సభతో పోలిస్తే ప్రస్తుత సభలో విపక్షం జన గళాన్ని మరింత బలంగా వినిపిస్తుందని చెప్పారు.

లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఎన్నికైన మిమ్మల్ని విపక్షం తరపున ఇండియా కూటమి తరపున అభినందిస్తున్నానని తెలిపారు. సభా నిర్వహణలో తాము పూర్తిగా సహకరిస్తామని విపక్షం తరపున రాహుల్ గాంధీ స్పీకర్‌కు హామీ ఇచ్చారు. విపక్షం మాట్లాడేందుకు అనుమతించడంతో పాటు భారత ప్రజల పక్షాన తమ ప్రాతినిధ్యాన్ని అనుమతిస్తారనే విశ్వాసం తమకుందని చెప్పారు. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ బలపరిచారు. మూజువాణి ఓటుతో తీర్మానాన్ని సభ ఆమోదించింది. లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు. కాగా, కే. సురేష్‌ను స్పీకర్‌ అభ్యర్ధిగా నిలిపిన విపక్షం సభలో ఓటింగ్‌కు పట్టుబట్టలేదు.