Saturday, October 5, 2024
HomeUncategorizedప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే పేపర్ రాశారు

ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే పేపర్ రాశారు

Date:

వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకై, పరీక్షలు రద్దవుతుండటంతో ఎంతోమంది విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఓ వైపు ‘నీట్‌ యూజీ-2024’ ప్రవేశపరీక్షపై గందరగోళం నెలకొన్న వేళ.. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 11న జరిగిన రివ్యూ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ రివ్యూ ఆఫీసర్‌ ప్రశ్న పత్రం లీకేజీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం నలుగురు ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేసినట్లు విచారణలో తేలింది. పేపర్‌ లీకవ్వలేదని తొలుత అధికారులు చెప్పినప్పటికీ.. టాస్క్‌ఫోర్స్‌ ముమ్మర దర్యాప్తుతో నాలుగు నెలల తర్వాత అసలు నిజాలు బయటపడ్డాయి.

రెండు చోట్ల లీకేజీ

మొత్తం రెండు చోట్ల పేపర్‌ లీకైనట్లు విచారణలో తేలింది. ప్రయాగ్‌రాజ్‌లోని బిషప్‌ జాన్సన్‌ గర్ల్స్‌ హైస్కూల్‌ కేంద్రంలో పరీక్ష ప్రారంభానికి 4 గంటల ముందే ప్రశ్నపత్రం బయటకొచ్చినట్లు అధికారులు తేల్చారు. అర్పిత్‌ వినీత్‌, యశ్వంత్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఫొటోలు తీసి కొందరు అభ్యర్థులకు చేరవేసినట్లు విచారణలో రుజువైంది. దీంతో అర్పిత్‌తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన అధికారులు విస్తుపోయే నిజాలను వెల్లడించారు. ప్రశ్నపత్రం ప్రింటింగ్‌ కేంద్రంలోనే లీకేజీ జరిగినట్లు గుర్తించారు. దీనికి నలుగురు ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు రాజీవ్‌ నారాయణ్‌ మిశ్రా, సునీల్‌ రఘువంశీ, విశాల్‌ దుబే, సుభాష్‌ ప్రకాశ్‌లను కారకులుగా తేల్చారు.

ఏకంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే..

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 950కి.మీ దూరంలోని ఓ ప్రింటింగ్‌ కేంద్రంలో ప్రశ్నపత్రాలను ముద్రిస్తున్నట్లు ప్రధాన నిందితుడు రాజీవ్‌ నారాయణ్‌కు సమాచారం అందింది. ఎలాగైనా లీక్‌ చేయాలనుకున్నాడు. దీని కోసం తన స్నేహితుడు విశాల్‌ దుబే సాయం తీసుకున్నాడు. అదే ప్రింటింగ్‌ ప్రెస్‌లో పని చేస్తున్న సునీల్‌ రఘువంశీ, విశాల్‌ స్నేహితులు కావడం రాజీవ్‌కు కలిసొచ్చింది. ఇద్దరూ కలిసి సునీల్‌ను ప్రలోభపెట్టారు. గతంలో విశాల్‌ దుబే, సునీల్‌ ఒకే కాలేజీలో చదువుకోవడం వల్ల అతడిని ఒప్పించడం చాలా సులువైంది. వృత్తిరీత్యా ఓ కన్సల్టేషన్‌ కార్యాలయంలో పని చేస్తున్న విశాల్, సుభాష్‌ ప్రకాశ్‌తో కలిసి వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులను చేరుస్తుండేవారు. ఈ నలుగురు పేపర్‌ను లీక్‌ చేసేందుకు పన్నాగం పన్నారు. ఆర్‌వో/ఏఆర్‌వో ప్రశ్నపత్రం ప్రింటింగ్‌కు రాగానే సునీల్‌ మిగతా ముగ్గురికీ సమాచారం అందించాడు. కాపీలు కావాలంటే రూ.10 లక్షలు డిమాండ్‌ చేశాడు. ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యే అవకాశం ఉన్నందున అభ్యర్థులు వాటి ఫొటోలు తీసుకోరాదని షరతు విధించాడు. దీనికి మిగతావారంతా అంగీకరించారు. సరైన అవకాశం కోసం సునీల్‌ వేచి చూశాడు. ప్రింటింగ్‌ మధ్యలో ఏదైనా సమస్య వస్తే ఆ పేపర్‌ను చించేస్తారు. పక్కా ప్రణాళిక ప్రకారం మెషీన్‌లో సునీల్ సమస్య సృష్టించి.. పేపర్‌ను చించేసినట్లు నటించి.. అధికారుల కళ్లుగప్పి ప్రశ్నపత్రాన్ని రహస్యంగా ఇంటికి తీసుకొచ్చేశాడు. మిగతా ముగ్గురికి సమాచారం అందించాడు.

ఒక్కొక్కరి నుంచి రూ.12 లక్షలు

ఈలోగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వివేక్‌ ఉపాధ్యాయ, బిహార్‌కు చెందిన అమర్జీత్‌ అనే ఇద్దరు ఏజెంట్లు.. అభ్యర్థులను గుర్తించి, వారి ఉద్యోగహామీ ఇచ్చి.. ఒక్కొక్కరి నుంచి రూ.12 లక్షలు వసూలు చేశారు. ఫిబ్రవరి 8న.. అంటే అంటే పరీక్షకు మూడు రోజుల ముందు ఓ హోటల్‌కు వారందర్నీ పిలిపించారు. ప్రశ్నపత్రంతో సునీల్‌ హోటల్‌కు చేరుకున్న తర్వాత సుభాష్‌ ప్రకాశ్‌ కొంత మంది సాయంతో ‘కీ’ తయారు చేయించాడు. ప్రశ్నపత్రంలోని అంకెల వరుస క్రమంలో ‘కీ’ని యథాతథంగా గుర్తుంచుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ‘కీ’ ఫొటోలను మాత్రమే అభ్యర్థులకు ఇచ్చి వారందరికీ హోటల్‌ లోనే ఆశ్రయం కల్పించారు. పరీక్ష రాసిన వారిలో సుభాష్‌ ప్రకాశ్‌ కూడా ఉన్నాడు.