ఒక వ్యక్తి సరదాగా హైకింగ్‌కు(కొండల్లో నడవటం) వెళదామనుకొని బయల్దేరాడు కొంత దూరం వెళ్లగానే మార్గం తప్పాడు. తిరిగి అతడు ఆ పర్వతాల నుంచి బయటపడటానికి 10 రోజులు పట్టింది. రోజుకు కొంత నీరు, అక్కడక్కడా దొరికే వైల్డ్ బెర్రీలతో మాత్రమే ప్రాణాలు నిలుపుకొన్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన లూకాస్ మెక్లిష్ అనే వ్యక్తి జూన్ 11న సరదాగా ది శాంటక్రజ్ పర్వతాలపైకి ఓ మూడు గంటల పాటు హైకింగ్‌కు వెళదామనుకొన్నాడు. అతడు కొద్దిసేపు నడిచాక దారి తప్పాడు. ముఖ్యంగా ఆ మార్గంలో ఉండాల్సిన గుర్తులు కార్చిచ్చు కారణంగా ధ్వంసమయ్యాయి. దీంతో అతడు తీవ్ర గందరగోళానికి గురయ్యాడు. అతడు కుటుంబసభ్యులు జూన్ 16 వరకు ఎదురుచూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మెక్లిష్ కోసం గాలింపుచర్యలు చేపట్టారు. ఎవరో సాయం కోసం అరవడం గమనించినా.. కచ్చితంగా అతడు ఎక్కడ ఉన్నాడో గుర్తించలేకపోయారు. కొన్ని రోజులపాటు గాలించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో గత వారం పలు డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టారు. అతడు పురాతన బిగ్ బేసిన్ రెడ్‌ఉడ్ స్టేట్ పార్క్‌లో చిక్కుకుపోయినట్లు గుర్తించారు. అత్యంత నీరసంగా ఉన్న పరిస్థితుల్లో అతడిని రక్షించారు. అతడి వద్ద ఓ ఫ్లాష్ లైట్, ఫోల్డింగ్ సిజర్స్, బూట్లు మాత్రమే ఉన్నాయి. చిన్నచిన్న సెలయేర్లలో పారే నీటిని రోజుకు ఒక గ్యాలన్ తాగి ప్రాణాలు కాపాడుకొన్నాడు. అడవిలో అక్కడక్కడా లభించే వైల్డ్ బెర్రీస్‌తోనే పొట్టపోసుకొన్నట్లు మెక్లిష్ చెప్పాడు. అమెరికాలోని ఇలాంటి చిక్కటి అడవుల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం.