ధ్వజస్తంభం దాటి హిందుయేతరులకు ప్రవేశం లేదు’ అని రాసి ఉన్న బోర్డును పెట్టాలంటూ మధురైలోని హైకోర్టు బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర మతాలకు చెందిన వారు వెళ్లేందుకు పిక్నిక్ స్పాట్ కాదన్నారు. ఉత్తర్వుల మేరకు దేవస్థానం యధాస్థితిని కొనసాగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. పళనికి చెందిన సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ వేయగా.. ఆలయ సూచన బోర్డును తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బోర్డుపై హిందుయేతరులకు ప్రవేశం నిషేధం అని రాసి ఉంటుంది. బోర్డును పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తమిళనాడు పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి సంబంధించిన కేసులో ధ్వజస్తంభం దాటి హిందుయేతరులను అనుమతించొద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేయాలని ఆలయ పరిపాలనకు సూచించింది. ఆలయ ఆచార వ్యవహారాల మేరకు కార్యకలాపాలు కొనసాగించాలని చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15కిందకు ఆలయాలు రావని హైకోర్టు పేర్కొంది. హిందుయేతరుల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని అన్యాయంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు కోర్టు విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి దర్శనానికి ముందు హిందుయేతరులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలయాన్ని సందర్శించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకున్న తర్వాతనే ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. ధ్వజస్తంభం దాటి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధిస్తూనే పౌరులందరికీ తమ మతాన్ని అనుసరించేందుకు రాజ్యాంగం హక్కు కల్పిస్తుందని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాల మధ్య మత సామరస్యం అవసరమని జస్టిస్ శ్రీమతి పునరుద్ఘాటించారు. భిన్న మతాల వారు ఒకరి విశ్వాసాలను, భావాలను గౌరవించినప్పుడే సామరస్యం వెల్లివిరుస్తుందని అభిప్రాయపడ్డారు.