Tuesday, December 24, 2024
Homeఅంతర్జాతీయంఎక్కువ పిల్లలుంటే.. జీవితాంతం ట్యాక్స్‌ బంద్

ఎక్కువ పిల్లలుంటే.. జీవితాంతం ట్యాక్స్‌ బంద్

Date:

ఐరోపా దేశం హంగేరీ జనాభాను పెంచుకునేందుకు ఆ దేశ ప్రభుత్వం వినూత్న ఆలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎక్కువమంది సంతానం ఉన్నవారు జీవితాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని స్వయంగా దేశ ప్రధానే ప్రకటించడం గమనార్హం. ఐరోపాలో జననాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఈ సమస్యకు వలసలు పరిష్కారంగా మారుతున్నాయి. జనాభాను పెంచుకునేందుకు వలసదారులను ఆహ్వానించాల్సి వస్తోంది. అందుకే మేం విభిన్న ఆలోచనలతో ముందుకొచ్చాం. కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువమందిని కనే మహిళలకు తమ జీవితకాలం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పిస్తాం” అని హంగేరీ ప్రధాని విక్టోర్‌ అర్బన్‌ తాజాగా ఆసక్తికర ప్రకటన చేశారు.

దీంతోపాటు పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లు కొనుగోలు చేసేందుకు వీలుగా సబ్సిడీని కూడా ఇవ్వనున్నట్లు హంగేరీ ప్రభుత్వం వెల్లడించింది. అంతేగాక, పిల్లల పెంపకం కోసం దేశవ్యాప్తంగా 21వేల క్రెచ్‌లను ప్రారంభించినట్లు తెలిపింది. ఇలాంటి మినహాయింపులతో పెళ్లిళ్లు, కుటుంబవ్యవస్థను ప్రోత్సహించినట్లవుతుందని అక్కడి సర్కారు అభిప్రాయపడుతోంది. హంగేరీ ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి బంపరాఫర్లు ప్రకటించింది. పెళ్లిళ్లు, జననాల రేటును పెంచేందుకు 2019లో ఓ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దానికింద, 41ఏళ్లు రాకముందే పెళ్లి చేసుకునే అమ్మాయిలకు 10 మిలియన్‌ ఫోరింట్స్‌ (హంగేరీ కరెన్సీ) సబ్సిడీ రుణాలు కల్పించింది. పెళ్లయిన తర్వాత ఆ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే రుణంలో మూడోవంతును మాఫీ చేస్తామని తెలిపింది. ఒకవేళ ముగ్గురు అంతకంటే ఎక్కువ సంతానం కలిగితే మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఆఫర్‌ ఇచ్చింది. ప్రస్తుతం హంగేరీ జనాభా 96.4లక్షలుగా ఉంది.