Saturday, October 5, 2024
HomeUncategorizedఆ దేశం ఇంకా 2016లోనే ఉంది

ఆ దేశం ఇంకా 2016లోనే ఉంది

Date:

ప్రతి దేశంలో ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉన్నా, క్యాలెండర్ మాత్రం దాదాపు అన్ని దేశాలకు ఒకేలా ఉంటుంది. కానీ తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియాలో మాత్రం స్వంత క్యాలెండర్ ఉంటుంది. అక్కడ కొత్త సంవత్సర వేడుకలు చాలా భిన్నంగా జరుగుతాయి. ఆ దేశంలో మన సెప్టెంబర్ నెలలో న్యూ ఇయర్ జరుపుకుంటారు. ప్రపంచం మొత్తం 2024 సంవత్సరంలో ఉంది, కానీ ఇథియోపియా మాత్రం ఇంకా 2016లోనే ఉంది. త్వరలో, కిఈ సెప్టెంబర్‌లో 2017 సంవత్సరంలో ప్రవేశించనుంది. అంటే వాళ్ల టైమ్‌ ఏడు, ఎనిమిది ఏళ్లు వెనుకబడింది. ఆఫ్రికాలో రెండో అత్యధిక జనాభా కలిగిన దేశం ఇథియోపియా. ఆ దేశానికి సొంత క్యాలెండర్ ఉంది. అది ప్రపంచం మొత్తం ఫాలో అయ్యే గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే ఏడు సంవత్సరాల ఎనిమిది నెలలు వెనుకబడి ఉంది. అంటే, ప్రపంచం 2024లో ఉన్నా, ఇథియోపియా ఇంకా 2016లోనే ఉంది.

వారికి ఏడాదికి 13 నెలలు

ఇథియోపియన్ క్యాలెండర్‌ను జీజ్ క్యాలెండర్ అని కూడా పిలుస్తారు. ఇది పురాతన కాప్టిక్ క్యాలెండర్ ఆధారంగా రూపొందింది. ఈ క్యాలెండర్‌లో మొత్తం 13 నెలలు ఉంటాయి. 12 నెలలు, ఒక్కో నెలలో 30 రోజులు ఉంటాయి. పగుమే అనేది ఒక ఎక్స్‌ట్రా మంత్, ఇది లీపు సంవత్సరమా లేదా అనే దానిపై ఆధారపడి 5 లేదా 6 రోజులు ఉంటుంది. ఇథియోపియన్ కొత్త సంవత్సరాన్ని ఎంకుటటాష్ అని పిలుస్తారు. దీన్ని ఏటా సెప్టెంబర్ 11న జరుపుకుంటారు. ఈ రోజున, ప్రజలు కొత్త బట్టలు ధరించి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. చర్చిల్లో ప్రార్థనలు చేసి, ఆ తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి భోజనం చేస్తారు. రాత్రిపూట, పెద్ద పెద్ద మంటలు వేసి, వాటి చుట్టూ డ్యాన్స్ చేస్తారు.

1582లో కొత్త క్యాలెండర్, 7-8 సంవత్సరాల తేడా!

ప్రముఖ న్యూస్ వెబ్‌సైట్ సిఎన్ఎన్ రిపోర్ట్ ప్రకారం, 1582లో పోప్ గ్రెగరీ XIII గ్రెగోరియన్ క్యాలెండర్ అనే వెస్ట్రన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇథియోపియన్లు యేసుక్రీస్తు జననం ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల తరువాత జరిగిందని గమనించారు. నిపుణుల ప్రకారం, ఇథియోపియా ఆర్థోడాక్స్ చర్చి పాత తేదీలను కొనసాగించాలని ఎంచుకుంది, క్రీస్తుశకం 500 చుట్టూ రోమన్ చర్చి లెక్కలను సవరించింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌ ప్రకారం తేదీలను లెక్కించడం ప్రారంభించినా ఇథియోపియా సొంత క్యాలెండర్‌నే కొనసాగించింది.

రెండు క్యాలెండర్లతో జీవితం ఒక సవాలు!

సిఎన్ఎన్ రిపోర్ట్ ప్రకారం అంతర్జాతీయ సంస్థలు ఎక్కువగా గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఉపయోగించడం వల్ల, చాలా మంది ఇథియోపియన్లు పాశ్చాత్య, సంప్రదాయ ఇథియోపియన్ క్యాలెండర్ రెండింటినీ గుర్తుంచుకోవలసి వస్తుంది. ఇథియోపియా పురాతత్వ శాస్త్రవేత్త గోయిటోం డబ్ల్యూ టెక్లే ప్రకారం, గ్రామీణ ప్రాంతాలలో నివసించే ఇథియోపియన్లతో మాట్లాడేటప్పుడు వివిధ తేదీలు, గంటలను పరిగణనలోకి తీసుకొని, కొన్ని సంస్థలు నిరంతరం రెండు క్యాలెండర్ల మధ్య మారాల్సి ఉంటుంది.

టైమ్ కూడా డిఫరెంట్

ఇథియోపియాలో ఒక ప్రత్యేకమైన గడియార వ్యవస్థ ఉంది. ఇథియోపియన్లు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 12 గంటల గడియార వ్యవస్థను ఉపయోగిస్తారు, కానీ ఇది మధ్యరాత్రి 12 గంటలకు బదులుగా, ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. అంటే, ఈ దేశంలో ఉదయం 8 గంటలైతే, మిగిలిన ప్రపంచంలో ఉదయం 7 గంటలు అవుతుంది.