జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులపై సోరెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద ఈడీ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ధృవా పోలీసు స్టేషన్‌లో సీఎం సోరెన్ ఫిర్యాదు చేసినట్లు రాంచీ పోలీసులు వెల్లడించారు.
మరోవైపు మనీలాండరింగ్ కేసులో సీఎం సోరెన్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో భారీ భద్రత నడుమ రాంచీలోని సోరెన్ నివాసానికి చేరుకున్న ఈడీ బృందాలు.. సోరెన్‌ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మనీలాండరింగ్ కేసులో సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ఈడీ.. విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో సోరెన్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.