Friday, October 4, 2024
HomeUncategorizedఎక్కువ విటమిన్ల ఆహారం తీసుకుంటాను

ఎక్కువ విటమిన్ల ఆహారం తీసుకుంటాను

Date:

విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటానని అదే తన ఆరోగ్య రహస్యమని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ చెప్పారు. ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో యువ పారిశ్రామికవేత్తలకు ఆయన కొన్ని సూచనలు చేశారు. జెరోదా సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌తో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. కార్యకలాపాల్లో తలమునకలై ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదని, తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీనివల్ల శరీరంలో ఏవైనా సమస్యలు తలెత్తితే ముందుగానే గుర్తించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తాను ఎక్కువగా విటమిన్లు తీసుకుంటానని, దీనివల్ల ఎలాంటి ప్రతికూలతలు ఉండబోవని చెప్పారు. ఈ సందర్భంగా గ్రెయిల్‌ టెస్ట్‌ ఆవశ్యకతను వివరించారు. ఈ పరీక్షతో క్యాన్సర్‌ లక్షణాలను ముందస్తుగా గుర్తించేందుకు వీలుపడుతుంది. డీఎన్‌ఏ జన్యువులను సూక్ష్మంగా పరిశీలించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.

ఆరోగ్యం గురించి బిల్‌గేట్స్‌ తరచూ ప్రస్తావిస్తుంటారు. బయటకు కనిపించే ఆరోగ్యం మాత్రమే ప్రధానం కాదని, మెదడు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని ఆయన చెబుతుంటారు. కంటినిండా నిద్రపోయినప్పుడే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటారు. యుక్త వయసు నుంచే ఎక్కువ సేపు నిద్రపోవడం అలవర్చుకోవాలని, మలివయసులో దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందని వివరిస్తుంటారు. న్యూరో సైంటిస్ట్‌ మ్యాథ్యూ వాకర్‌ రాసిన ‘వై వి స్లీప్‌’ పుస్తకం ద్వారా నిద్ర గురించి తనకు ఎన్నో విషయాలు తెలిశాయని గతంలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో గేట్స్‌ ప్రస్తావించారు. ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట కచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని, తాను కూడా దీన్నే అనుసరిస్తున్నానని చెప్పారు.