Friday, October 4, 2024
HomeUncategorizedమరో ఎన్నికల సమరానికి ఈసీ కసరత్తు

మరో ఎన్నికల సమరానికి ఈసీ కసరత్తు

Date:

కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూకశ్మీర్‌తో పాటు హరియాణా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఆగస్టు 20 నాటికి ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తి చేసి తుది జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది. ఈమేరకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైనచోట కొత్తగా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ జూన్‌ 25 నుంచి ప్రారంభమవుతుందని ఈసీ వెల్లడించింది. జులై 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. జులై 25న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని, ఆగస్టు 9 వరకు అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 20న తుది జాబితా విడుదల చేస్తామని పేర్కొంది.

2018లో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ రద్దయిన తర్వాత నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. ఆ తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌ ఓటర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విస్త్రృతం చేయాలని ఈసీ నిర్ణయించింది. అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులను ఆదేశించింది. మరోవైపు హరియాణా అసెంబ్లీ గడువు నవంబర్‌ 11తో ముగుస్తుండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్‌ 26, ఝార్ఖండ్‌ అసెంబ్లీ గడువు జనవరి 5, 2025తో ముగియనుంది. ఈనేపథ్యంలో వీటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. మరోవైపు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఈసీఐ వారం రోజుల్లో సమావేశం కానుంది.