ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించారు. ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై రైలు ట్రయల్ రన్‌ను గురువారం విజయవంతంగా నిర్వహించారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంగల్డన్ నుంచి రియాసీ వరకు రైలును ప్రయోగాత్మకంగా నడిపారు. మధ్యలో చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన ప్రధాన ఆర్చ్‌పై రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఈ బ్రిడ్జ్‌పై జూన్ 16న ఓ రైలు ఇంజిన్‌తో ట్రయల్ రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. చీనాబ్ నదిపై కట్టిన ఈ రైల్వే వంతెన మీదుగా రాంబన్ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్ – శ్రీనగర్ – బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వేవంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం.