హజ్ యాత్రకు వెళ్లిన వారిలో వడదెబ్బ కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య 1000 దాటినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. వీరిలో అత్యధికులు ఈజిప్టు దేశస్థులే కాగా.. భారత్, పాకిస్థాన్, జోర్డాన్, ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యూనిషియాకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. మృతి చెందినవారిలో అత్యధికంగా ఈజిప్టు వాసులే ఉన్నట్లు అరబ్ రాయబారి వెల్లడించారు. గురువారం ఒక్కరోజే ఆ దేశానికి చెందిన 58 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 658కి చేరింది. వీరిలో 630 మంది అనుమతి లేని యాత్రికులే ఉన్నట్లు సమాచారం. మొత్తంగా 10 దేశాలకు చెందిన 1081 మంది యాత్రికులు ఎండ దెబ్బకు మరణించినట్లు తెలిసింది. ఆయా దేశాల రాయబార కార్యాలయాల ప్రకటనల ఆధారంగా ఈ సంఖ్యను లెక్కించినట్లు సమాచారం. మెడికల్ కాంప్లెక్సు వద్ద కొంతమంది మృతుల వివరాలు ప్రకటించారు. జాబితాలో అల్జీరియా, ఈజిప్టుతోపాటు భారత్‌కు చెందినవారి పేర్లు కూడా ఉన్నాయి.
అయిదు రోజుల హజ్ యాత్రలో భాగంగా ఈ ఏడాది మొత్తం 18.3 లక్షలమంది హజ్ యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇందులో 22 దేశాలకు చెందిన యాత్రికులు 16 లక్షలమంది ఉండగా, సౌదీ పౌరులు రెండు లక్షలకు పైగా ఉంటారని సౌదీ హజ్ అధికార యంత్రాంగం తెలిపింది. యాత్ర అనుమతి కోసం భారీగా ఖర్చు అవుతుండటంతో చాలామంది అక్రమ మార్గాల్లో మక్కాకు చేరుకుంటున్నారు. ఇలా వచ్చే వేల మందిని స్థానిక అధికారులు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. వారి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగిసిన తర్వాత.. రిజిస్టర్ చేసుకున్న వారికే అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏసీ షెల్టర్లలో బస చేసేందుకు అనుమతి ఉంటుంది. అందుకే మరణిస్తున్న వారిలో రిజిస్టర్ చేసుకోని వారే అధికంగా ఉన్నారని అధికారులు చెప్పారు.