దక్షిణ భారత దేశంలో భానుడు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ.. గత కొన్ని రోజులుగా ఉత్తర భారతాన్ని మాత్రం ఎండలు వణికిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సుమారు 50 డిగ్రీల ఎండలు నమోదు అవుతున్నాయి. ఇక ప్రధానంగా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో హీట్ వేవ్ దారుణంగా ఉంది. ఈ క్రమంలోనే గత 24 గంటల్లోనే ఢిల్లీలో ఏకంగా 50కి పైగా మరణాలు సంభవించడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఎండదెబ్బ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని 10 జిల్లాలు ఉండగా.. కేవలం 3 జిల్లాల్లోనే ఈ 40 కి పైగా మరణాలు చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గడిచిన 24 గంటల్లో 50కి పైగా మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రులకు తరలించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ 50 మృతదేహాల్లో 40 మృతదేహాలను డీడీయూ ఆస్పత్రిలోనే చేర్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ మరణాలకు సరైన కారణం.. శవపరీక్ష రిపోర్ట్ ఆధారంగా తెలుస్తుందని అధికారులు పేర్కొన్నా.. అవి ఎండవేడిమికే అని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మృతుల సంఖ్య అసాధారణంగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని డాక్టర్లు చెబుతున్నారు.
ఢిల్లీలోని లజ్పత్నగర్లో 7 మృతులు, నైరుతి ఢిల్లీలో 2 ఇద్దరు మరణాలు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో ఢిల్లీలోని 10 జిల్లాల్లో 50 మందికి పైగా మరణాలు నమోదయ్యాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని డాక్టర్లు తెలిపారు. సగటున 100 మంది వ్యక్తులు వేడి, అలసట, అతిసారంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలతోనే ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక ఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో.. మొత్తం 36 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు ఆ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. ఆ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ఎండ వేడిమికి ఓ రోగి మృతి చెందినట్లు చెప్పారు. ఇక ఆస్పత్రిలోని హీట్ స్ట్రోక్ యూనిట్లో ఆరుగురు రోగులు చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.