కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే తన కూతురు పట్ల కాలయముడు అయ్యాడు. అభం శుభం తెలియని బాలిక ప్రాణాలు తీసాడు. సభ్యసమాజం తల దించుకునే ఘటన ఇది. మియాపూర్‌లో సంచలనం సృష్టించిన 12 ఏళ్ల బాలిక ‘వసంత’ అనుమానాస్పద మృతి కేసులో భయానక వాస్తవం వెలుగులోకి వచ్చింది. పాపను హత్య చేసింది కన్నతండ్రేనని తేలింది. అమ్మాయిని హత్య చేసి, 12 రోజులుగా కపట నాటకాలు ఆడుతూ పోలీసులనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి, కన్నకుమార్తెతోనే కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నించి.. ‘అమ్మకు చెప్తా..’ అని పాప అరవడంతో దారుణంగా కొట్టి చంపేశాడు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను మియాపూర్ ఏసీపీ పి. నర్సింహారావు బుధవారం (జూన్ 19) మీడియాకు వెల్లడించారు. మహబూబ్‌బాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామం లక్ష్మణ తండాకు చెందిన బానోతు నరేష్ దంపతులు బతుకుదెరువు కోసం మియాపూర్ సమీపంలోని నడిగడ్డ తండాకు వలస వచ్చారు. ఇక్కడికి వలస వచ్చిన 15 రోజులకే కన్న కూతురిని నరేష్ హత్య చేశాడు. నరేష్ మద్యానికి బానిసవడంతో పాటు సెల్‌ఫోన్లో పోర్న్ చూసేందుకు అలవాటు పడ్డాడు. మియాపూర్ సమీపంలోని అడవిలోకి తన కూతురిని తీసుకెళ్లిన నరేష్ కోరిక తీర్చాలని బలవంతపెట్టాడు. భయపడిపోయిన బాలిక అమ్మకు చెప్తానని అరవడంతో హతమార్చాడు. ఆ తర్వాత తానేమీ ఎరుగనట్టు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కూతురు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టినట్టు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు తండ్రే ఈ హత్య చేశాడని గుర్తించారు.