Friday, October 4, 2024
HomeUncategorizedవానమ్మా.. నేలపైకి వచ్చి పోవమ్మా

వానమ్మా.. నేలపైకి వచ్చి పోవమ్మా

Date:

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో వర్షాలు కురవాలని, రైతులు కప్పతల్లి పూజలు చేస్తున్నారు. కప్పలకు పెళ్లిళ్లు చేసి వర్షాల కోసం వరుణ దేవుడిని ప్రార్థిస్తున్నారు. వర్షాలు బాగా కురవాలని జగదేవపూర్ మండలం బీజీ వెంకటాపూర్ గ్రామంలో కప్పల పెళ్లి నిర్వహించారు. రెండు కప్పలకు పసుపు నీళ్లతో స్నానం చేయించి, మంత్రోచ్ఛారణల మధ్య ఆ రెండు కప్పులకు అందరూ చూస్తుండగా వివాహం జరిపించారు. ఈ ఆచారంలో భాగంగా మహిళా రైతులు కప్పలకు నీళ్లు పోస్తుంటే పిల్లలు కర్రకు కట్టిన కొత్తగా పెళ్లయిన కప్పల జంటను తీసుకొని గ్రామమంతా తిరిగారు.

ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో వర్షాలు బాగా కురవడం లేదు. దాదాపు 60000 ఎకరాల్లో పత్తి వేసిన రైతులు పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. జూన్ మొదటి వారంలోనే మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు ముందే పత్తి విత్తుకున్నారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో మాత్రమే వర్షాలు కురుస్తుండడంతో వర్షాలు పడని ప్రాంతంలో ఉన్న రైతులు వర్షాల కోసం ఆకాశం వంక దిగాలుగా చూస్తున్నారు. ఇప్పటికే మొలకెత్తిన పత్తి పంటలను కాపాడుకోవడానికి రైతులు వాటర్ గన్ లు, స్ప్రింక్లర్లతో నీటిని అందిస్తూ నానా అగచాట్లు పడుతున్నారు.. చాలా మంది వరి, మొక్కజొన్న ఇంకా పంట వెయ్యలేదు. నాలుగు వర్షాలు గట్టిగా పడితే వారి, మొక్కజొన్న సాగు చెయ్యాలని చూస్తున్నారు. కానీ వర్షాలే లేవు.

కప్పల పెళ్లి చేస్తే, కప్ప తల్లి పూజలు చేస్తే వరుణ దేవుడు కరుణిస్తాడని నమ్ముతున్నారు. వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం వర్షాలు కురుస్తాయా? కప్పల పెళ్లి రైతుల అదృష్టాన్ని మారుస్తుందా? లేదా తెలంగాణలోని రైతులు ఈసారి వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందా? అన్నది ప్రస్తుతం ప్రతి ఒక్కరి మనసులోనూ మెదులుతున్న ప్రశ్నలు.