దేశంలోని ఎక్కడా లేని విధంగా తిరుమలలో భక్తుల రద్దీ నిత్యం ఉంటుంది. తిరుమల శ్రీవారికి మరోసారి కాసుల వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజు మాత్రమే ఏకంగా రూ.5.04 కోట్ల ఆదాయం వచ్చిందంటే ఇక్కడ భక్తుల రద్దీ ఎంత ఎక్కువగా ఉందో మనకు అర్థం అవుతుంది.
జనవరిలో ఇదే టాప్ రికార్డ్ స్థాయి ఆదాయమని అధికారులు తెలిపారు. ఇక, గతనెల అంటే డిసెంబర్ 2023లో కూడా శ్రీవారి ఆదాయం రూ.5 కోట్ల మార్క్‌ను అందుకుంది. తొలిసారి జనవరి నెలలో ఆ రికార్డును చేరుకుంది. శుక్రవారం నుంచి వరుసగా సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వరుస సెలువుల కారణంగా కొండపై ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. ఇదిలా ఉండగా, ఒక్క ఆదివారం మాత్రమే తిరుమల వెంకటేశ్వరస్వామివారిని మొత్తం 85,142మంది భక్తులు దర్శించుకున్నారు. ఒక్కరోజు స్వామి వారికి ఆదాయం రూ.5.04 కోట్లు వచ్చింది. ఇందులో 22,064మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మొత్తం 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఇక, సర్వదర్శనం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు మాత్రం స్వామి వారి దర్శనం కోసం పన్నెండు గంటల సమయం పడుతోంది.