Friday, October 4, 2024
HomeUncategorizedప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ

Date:

కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఉప ఎన్నిక ద్వారా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేసేందుకు హస్తం పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ప్రియాంక పోటీపై స్పందించిన కాంగ్రెస్‌ నేతలు, స్థానిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ స్పందిస్తూ.. ”ఇక సందేహాలు అంటూ ఏమీ లేవు. వయనాడ్‌ను గెలుచుకునేది ప్రియాంకే” అని ఆమె ఫొటోను షేర్‌ చేశారు. కేరళ ప్రజల తరఫున గళమెత్తేందుకు ప్రియాంక పార్లమెంట్‌కు వెళ్లనున్నారని.. ఇకపై ఇద్దరు గాంధీలు పోరాటానికి సిద్ధమయ్యారని పార్టీ నేత సచిన్‌ పైలట్‌ పేర్కొన్నారు. ప్రియాంక రాకపై స్థానిక మహిళా ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్‌ ఇక్కడ లేరనే భావనను ఆమె భర్తీ చేయగలరని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళ నుంచి ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు. ఒకవేళ వయనాడ్‌లో జరిగే ఉప ఎన్నికలో ప్రియాంక గెలిస్తే.. 18వ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో గెలుపు పతాకం ఎగురవేసిన తొలి మహిళా ఎంపీగా నిలువనున్నారు. వయనాడ్‌లో రాహుల్‌ కంటే ప్రియాంకగాంధీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని స్థానిక పార్టీ నేతలు మీడియా ఎదుట విశ్వాసం వ్యక్తంచేశారు. కాగా.. 2019 నుంచి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ప్రియాంక ఏ స్థానంలోనూ ఇప్పటివరకు పోటీ చేయలేదు. కాంగ్రెస్‌పై అభిమానం చూపుతున్న వయనాడ్‌లో ఆమె తొలిసారి పోటీ చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తారని హస్తం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.