Tuesday, December 24, 2024
Homeఅంతర్జాతీయంచైనాలో మహిళా జర్నలిస్టుకు ఐదేళ్ల జైలు శిక్ష

చైనాలో మహిళా జర్నలిస్టుకు ఐదేళ్ల జైలు శిక్ష

Date:

చైనా ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపించే వ్యక్తులు, సంస్థలపై చైనా ఉక్కుపాదం మోపుతూనే ఉంది. ఈ క్రమంలో మీటూ ఉద్యమంలో భాగంగా మహిళా హక్కులపై విస్తృత ప్రచారం చేసిన ఓ మహిళా జర్నలిస్టుకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా లక్ష యువాన్ల (సుమారు రూ.11.5లక్షలు) జరిమానా వేసినట్లు సమాచారం. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడంతోపాటు అధికారాల అణచివేతను ప్రోత్సహిస్తున్నారనే అభియోగాలు మోపింది. ఈ కేసులో మహిళా జర్నలిస్టుతోపాటు మరో సామాజిక కార్యకర్తకు మూడున్నరేళ్లు శిక్ష విధించింది.

ప్రపంచవ్యాప్తంగా మీటూ ఉద్యమం కొనసాగిన వేళ.. చైనాలోనూ పలు కేసులు వెలుగుచూశాయి. ఆ దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీలో పీహెచ్‌డీ సూపర్‌వైజర్‌.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఓ యువతి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. వీటిని హువాంగ్‌ షియేకిన్‌ అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ స్థానికంగా విస్తృత ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ఆమెతోపాటు మరో సామాజిక వేత్త వాంగ్‌ జియాన్‌బింగ్‌లు సెప్టెంబర్‌ 2021 నుంచి కనిపించకుండా పోయారు. అప్పుడే చైనా అధికారులు వారిని అరెస్టు చేసినట్లు సమాచారం. కార్మిక హక్కులపై పోరాటం చేసే వాంగ్‌.. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఎంతోమంది మహిళలకు బాసటగా నిలిచారు.

ఈ కేసు సెప్టెంబర్‌ 2023లో విచారణకు రాగా.. తాజాగా వారికి శిక్ష ఖరారైనట్లు హువాంగ్‌, వాంగ్‌ మద్దతుదారులు వెల్లడించారు. హువాంగ్‌కు ఐదేళ్ల శిక్ష పడిందని.. సెప్టెంబర్‌ 18, 2026న విడుదలవుతారని తెలిపారు. కాగా వాంగ్‌కు మాత్రం మూడున్నరేళ్ల శిక్ష ఖరారైనట్లు సమాచారం. ఇదిలాఉంటే, ప్రభుత్వంపై ధిక్కారస్వరం వినిపించే అనేకమందిని చైనా నిర్బంధిస్తోన్న విషయం తెలిసిందే. 2015లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచిన అనేకమంది మహిళలను అరెస్టు చేసిన ఘటనలూ ఉన్నాయి.