Sunday, November 10, 2024
Homeఅంతర్జాతీయంకువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం

కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం

Date:

కువైట్‌ మంగాఫ్ నగరంలో కార్మికులు నివాసం ఉంటున్న ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 40 మందికిపైగా సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు కువైట్‌ మీడియా తెలిపింది. బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లో పై అంతస్తు వరకూ వ్యాపించాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో అందులో నివసిస్తున్న వారు బయటకు వచ్చేందుకు ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పటివరకూ 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

‘అగ్నిప్రమాదం సభవించిన భవనంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉంటున్నారు. ఘటన అనంతరం చాలా మందిని రక్షించాం. కానీ దురదృష్టవశాత్తూ మంటల ధాటికి పొగ పీల్చడం వల్ల చాలా మంది మరణించారు’ అని సీనియర్‌ పోలీస్‌ కమాండర్‌ ఒకరు తెలిపారు. సుమారు 50 మందిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సదరు కమాండర్‌ వెల్లడించారు.