Thursday, October 3, 2024
HomeUncategorizedఅయోధ్య ప్రజల చేతిలో బిజెపి ఓడినట్లే

అయోధ్య ప్రజల చేతిలో బిజెపి ఓడినట్లే

Date:

వారణాసిలో పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఓటమి నుంచి తప్పించుకున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. కేరళలోని మలప్పురంలో ఓ సమావేశంలో రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు. అయోధ్య ప్రజల చేతిలో బిజెపి ఓడినట్లే వారణాసిలో మోడీ ఓడిపోయి ఉండేవారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కావాల్సిన సీట్లు బిజెపి ఒంటరిగా సాధించకపోవడానికి మోడీ నైతిక బాధ్యత వహించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా నేతలు మాట్లాడారని, కానీ అదే రాజ్యాంగానికి ప్రమాణస్వీకారం వేళ మోడీ దండం పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు వారికి ఏం కావాలో ప్రధానికి స్పష్టంగా తెలిసేలా చేశారన్నారు.

మోడీ వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై 1,50,000 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అయోధ్యలో సమాజ్ వాదీ పార్టీకి చెందిన అవదేశ్ ప్రసాద్ బిజెపి అభ్యర్థి లల్లూ సింగ్‌పై విజయం సాధించారు. బిజెపి కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లో ఆరు స్థానాలతో సహా మొత్తం 99 స్థానాలను ఇండియా గెలుచుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి 240 సీట్లలో విజయం సాధించినా, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి మరో 32 సీట్లు కావాల్సి రావడంతో చంద్రబాబునాయుడు(టీడీపీ), నీతీశ్‌కుమార్ (జేడీయూ) సహాయం తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.