ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్,తన ప్రేయసి జార్జి హాడ్జ్‌ని వివాహాం చేసుకున్నారు. జూన్ 10న లండన్‌లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఆ ఫొటోలను వీరిద్దరూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆల్‌రౌండర్ డేనియల్ వ్యాట్ గతేడాది ప్రేయసితో తన ఎంగేజ్‌మెంట్ గురించి ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపర్చిన సంగతి తెలిసిందే. వ్యాట్ ప్రియురాలు జార్జి హాడ్జ్.. సీఏఏ బేస్‌కు చెందిన ఓ మహిళా ఫుట్‌బాల్ జట్టుకు హెడ్‌గా ఉన్నారు. లండన్‌లో ఎఫ్‌ఏ లైసెన్స్‌డ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 2019 నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉండగా.. 2023 మార్చిలో దక్షిణాఫ్రికాలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.
33 ఏళ్ల వ్యాట్.. ఇంగ్లాండ్ తరఫున ఇప్పటి వరకు 105 వన్డేలు, 151 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈమె 2014లో టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సరదాగా ప్రపోజ్ చేసి అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇలా మహిళా ఆటగాళ్లు ఒకరినొకరు ఇష్టపడి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2022లో ఇంగ్లాండ్ క్రికెటర్లు కేథరిన్ బ్రంట్, నటాలియా సీవర్ పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు న్యూజిలాండ్ మహిళా క్రికెటర్లు అమీ సాటర్త్‌వైట్ – తహుహు, దక్షిణాఫ్రికా క్రికెటర్లు మరిజేన్ కాప్, డాన్ నీకెర్క్ కూడా దంపతులుగా మారిన సంగతి తెలిసిందే.