Thursday, October 3, 2024
HomeUncategorizedఒడిశాలో కొత్త సీఎంకు లేని అధికార భవనం

ఒడిశాలో కొత్త సీఎంకు లేని అధికార భవనం

Date:

ఒడిశాలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి సిద్ధమవుతోంది. రాష్ట్ర సీఎం అధికార భవనం కోసం భాజపా అన్వేషణ కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తింది. రెండు దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగిన నవీన్‌ పట్నాయక్‌.. తన సొంత ఇంటినుంచే కార్యకలాపాలు సాగించడంతో ఈ సమస్య వచ్చి పడింది. 2000లో జరిగిన ఎన్నికల్లో బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. నాడు ప్రభుత్వం కేటాయించిన భవనంలో కాకుండా భువనేశ్వర్‌లోని తన సొంత నివాసం ‘నవీన్‌ నివాస్‌’ నుంచే పని చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. నాటి నుంచి తాజా ఎన్నికల వరకు అక్కడినుంచే విధులు నిర్వర్తించారు. మిగతా పాలనా విభాగాలు సైతం ఇక్కడినుంచే పని చేశాయి. నవీన్‌ నివాస్‌ను ఆయన తండ్రి, దివంగత నేత బిజూ పట్నాయక్‌ నిర్మించారు.

అంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన హేమానంద బిస్వాల్‌, జానకీ బల్లభ్‌ పట్నాయక్‌లు భువనేశ్వర్‌ క్లబ్‌ సమీపంలోని ఓ చిన్న భవనం నుంచి కార్యకలాపాలు సాగించారు. 1995లో జేబీ పట్నాయక్‌ ఎన్నికైన తర్వాత అక్కడినుంచి ఓ రెండంతస్తుల భవనంలోకి మార్చారు. పట్నాయక్‌ కుటుంబానికి చెందిన అసలైన బంగ్లా (ఆనంద్‌ భవన్‌) పూర్వ రాజధాని కటక్‌లో ఉంది. నవీన్‌ పట్నాయక్‌ అక్కడే జన్మించారు. ఆ తర్వాత కొత్త రాజధాని ఏర్పడిన అనంతరం భువనేశ్వర్‌కు మకాం మార్చారు. ఆనంద్‌ భవన్‌ను ప్రస్తుతం మ్యూజియంగా తీర్చిదిద్దారు. ఒడిశాలో తిరుగులేని నేతగా ఉన్న నవీన్‌ పట్నాయక్‌ 24 ఏళ్లకు పైగా రాష్ట్రాన్ని పాలించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా చేతిలో బీజేడీ ఓడిపోయింది. రాష్ట్రంలో తొలిసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తోన్న భాజపా.. జూన్‌ 12న కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరుకానున్నట్లు సమాచారం. అయితే, కొత్త సీఎం తాత్కాలిక నివాసంగా స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.