Thursday, October 3, 2024
HomeUncategorizedమోడీ తొలి విదేశీ పర్యటన ఇటలీ..?

మోడీ తొలి విదేశీ పర్యటన ఇటలీ..?

Date:

కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోడీ తొలి విదేశీ పర్యటన ఇటలీ వెళ్లనున్నారు. ఆ దేశంలో జరగబోయే జీ7 దేశాల వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా ప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్ట్‌లో జూన్‌ 13-15 తేదీల్లో జీ7 దేశాల సదస్సు జరగనుంది. అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు జో బైడెన్‌, ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌, జపాన్‌, కెనడా ప్రధానులు ఫుమియో కిషిదా, జస్టిన్‌ ట్రూడో తదితర నేతలు దీనికి హాజరుకానున్నారు. ఈ సమావేశం నిమిత్తం జూన్‌ 13న ప్రధాని మోడీ ఇటలీ వెళ్లి.. 14వ తేదీ రాత్రికి తిరిగి స్వదేశానికి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనిపై కేంద్రం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ప్రధాని వెంట కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ తదితర ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం ఇటలీ వెళ్లనున్నట్లు సమాచారం. సదస్సులో భాగంగా పలువురు ప్రపంచ నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. అయితే దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ కెనడా ప్రధాని ట్రూడోతో ముఖాముఖీ భేటీ ఉంటుందా? లేదా? అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. గతేడాది జపాన్‌లోని హిరోషిమా వేదికగా జరిగిన జీ7 దేశాల సదస్సుకు మోదీ హాజరైన సంగతి తెలిసిందే. అందులోభాగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఇతర ప్రపంచ నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఈ ఏడాది కూడా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో పాటు గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం అంశాలపై నేతలు చర్చలు జరిపే అవకాశాలున్నాయి. జీ7 కూటమిలో అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ వార్షిక సమావేశానికి భారత్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని 11 అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను ఇటలీ ఆహ్వానించింది.