Thursday, October 3, 2024
HomeUncategorizedఒకప్పుడు ఉపాధ్యాయుడు.. ఇప్పుడు సిక్కిం సీఎం

ఒకప్పుడు ఉపాధ్యాయుడు.. ఇప్పుడు సిక్కిం సీఎం

Date:

సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ‘సిక్కిం క్రాంతికారి మోర్చా’ అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ చేత సోమవారం సిక్కిం గవర్నర్‌ లక్ష్మణ్‌ ఆచార్య ప్రమాణస్వీకారం చేయించారు. గ్యాంగ్‌టక్‌లోని పల్జోర్‌ స్టేడియంలో తమాంగ్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఆయనతోపాటు ఎస్‌కేఎం ఎమ్మెల్యేలు సోనమ్ లామా, అరుణ్‌కుమార్‌ ఉప్రేతి క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 32 స్థానాలకుగాను 31 స్థానాల్లో అధికార ఎస్కేఎం ఘన విజయం సాధించింది. 2019కి ముందు ఏకంగా 25 ఏండ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన ప్రతిపక్ష ‘సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌’ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. కాగా ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ సిక్కిం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం ఇది వరుసగా రెండోసారి. 2019 నుంచి 2024 వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు.

తమాంగ్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి 30 వేల మందికి ఆహ్వానించారు. ప్రమాణస్వీకారానికి కొన్ని నిమిషాల ముందు కార్యక్రమానికి విచ్చేసిన వారికి తమాంగ్ అభివాదం చేశారు. ఈ సందర్భంగా పటాసులు కాల్చి అభిమానులు సంబురాలు చేసుకున్నారు. కాగా మరోసారి సిక్కిం ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 56 ఏండ్ల ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్ రాష్ట్ర ప్రజల నుంచి మంచి ఆదరణ పొందారు. తమాంగ్‌ రాజకీయాల్లోకి రాకముందు మూడేండ్లు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1994 నుంచి 2009 వరకు ఆయన మంత్రిగా పనిచేశారు. ఎస్‌డీఎఫ్‌లో ఆయన చామ్లింగ్‌కు శిష్యుడిగా కొనసాగారు. 2009 తర్వాత ఆయనకు పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌తో విభేదాలు మొదలయ్యాయి.

దాంతో ఎస్‌డీఎఫ్‌ నుంచి బయటకు వచ్చి 2013లో సొంతంగా ఎస్‌కేఎం పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికల్లో 17 సీట్లు సాధించి 25 ఏండ్ల ఎస్‌డీఎఫ్‌ పాలనకు ముగింపు పలికారు. ఈ ఎన్నికల్లో ఏకంగా 31 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్ష ఎస్‌డీఎఫ్‌కు ఘోర పరాభవం రుచి చూపించారు. సిక్కింలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆ పార్టీలకు ఈ ఎన్నికల్లో 20 వేల ఓట్లు కూడా రాలేదు.