Thursday, October 3, 2024
HomeUncategorizedలోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ

Date:

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకోనున్నారు. శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తీర్మానం రాహుల్ గాంధీ ఎంపికను ఏకగ్రీవం చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ చేసిన ప్రచారాన్ని పార్టీ ప్రశంసించింది. సీడబ్ల్యూసీ సమేవశంలో సభ్యులందరూ రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఉండాలంటూ తీర్మానం చేసినప్పటికీ.. ఆయన మాత్రం తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. అందరూ కలిసి రాహుల్‌ని ప్రతిపక్ష నేతగా ఉండాలని డిమాండ్ చేయడంతో తప్పకుండా ఆయన బాధ్యతలు తీసుకుంటారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాహుల్ గాంధీ తాజాగా జరిగిన ఎన్నికల్లో వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ.. గతంతో పోల్చితే మెరుగైన ప్రదర్శన చేసింది. 99 స్థానాలతో దేశంలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. 2014లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా దక్కడం ఇదే తొలిసారి. 2019 ఎన్నికల్లో 52 స్థానాలు, 2014లో 44 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా దక్కాలంటే లోక్‌సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం 10 శాతం మంది ఉండాలి.