Thursday, October 3, 2024
HomeUncategorizedపదేళ్లయినా కాంగ్రెస్ 100 స్థానాలు దాటదు

పదేళ్లయినా కాంగ్రెస్ 100 స్థానాలు దాటదు

Date:

అసలైన భారత్‌ స్ఫూర్తిని మన కూటమి చాటుతుందని, మనది అత్యంత విజయవంతమైన భాగస్వామ్యం’ అని అన్నారు నరేంద్రమోడీ అన్నారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో శుక్రవారం జరిగింది. ఇందులో తమ లోక్‌సభా పక్ష నేతగా మోడీని ఎన్డీయే నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లలో ఈ కూటమి దేశాన్ని మూడుసార్లు ఐదేళ్లు పాలించింది. మరోసారి ఐదేళ్ల పాలనకు ప్రజలకు అవకాశమిచ్చారు. దేశం కోసం నిబద్ధత కలిగిన బృందం ఇది. ఎన్డీయే అంటేనే సుపరిపాలన. పేదల సంక్షేమమే మనందరి ప్రథమ కర్తవ్యం. దేశ అభివృద్ధి చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించాం. వికసిత్‌ భారత్‌ స్వప్నాన్ని సాకారం చేసి తీరుతాం. మన కూటమి అసలైన భారత్‌ స్ఫూర్తిని చాటుతుంది. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయవంతం కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం అవసరం. దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం కావాలి. కూటమిలో పరస్పర విశ్వాసమే ప్రధానం. అన్ని అంశాల్లో ఏకగ్రీవ నిర్ణయాలే లక్ష్యం” అని మోదీ అన్నారు. ఇక ఎన్డీయే అంటే ‘న్యూ ఇండియా, డెవలప్‌డ్‌ ఇండియా, ఆస్పిరేషనల్‌ ఇండియా’ అని కొత్త అర్థం చెప్పారు.

దక్షిణాది ప్రజలు ఎన్డీయేను ఆదరించారు. కర్ణాటక, తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లోని ప్రజలు భాజపాకు అండగా నిలిచారు. తమిళనాడులో సీట్లు గెలవలేకపోయినా ఓట్లు పెరిగాయి. కేరళలోనూ మా కార్యకర్తలు ఎన్నో బలిదానాలు చేశారు. తొలిసారి అక్కడి నుంచి మా ప్రతినిధి సభలో అడుగుపెడుతున్నారు. అరుణాచల్‌, సిక్కింలో క్లీన్‌స్వీప్‌ చేశాం. ఏపీ ప్రజలు కూటమికి పెద్ద ఎత్తున మద్దతిచ్చారు. చంద్రబాబుతో కలిసి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాం. ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టింది” అని మోదీ కొనియాడారు. ”కాంగ్రెస్‌ చాలా వేగంగా పతనమవుతోంది. పదేళ్ల తర్వాత కూడా ఆ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇప్పటికీ తన శక్తి సామర్థ్యాలను తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. కాంగ్రెస్‌ హయాంలో వారి సొంత ప్రధానినే అవమానించారు. ఆయన నిర్ణయాలను లెక్క చేయలేదు. గత మూడు ఎన్నికల్లో వారికొచ్చిన స్థానాలు.. ఈ ఒక్క ఎన్నికల్లో మేం సాధించిన సీట్ల కంటే తక్కువే. మరో పదేళ్లయినా ఆ పార్టీ 100 స్థానాల మార్క్‌ను దాటలేదు” అని మోడీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.