పెద్దపెద్ద చదువులు చదివి, గొప్పగా బతకాలి అనుకున్న ఒక భారతీయ విద్యార్థి అమెరికా కల నీరుగారిపోయింది. ఆశ్రయం పొందిన వ్యక్తి అతడి తల, ముఖంపై సుత్తితో 50 సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు వచ్చే వరకు భారతీయ విద్యార్థి మృతదేహం వద్దనే ఉన్నాడు. అమెరికాలోని జార్జియాలో ఈ సంఘటన జరిగింది. భారత్‌కు చెందిన 25 ఏళ్ల వివేక్ సైనీ అమెరికాలో మాస్టర్స్ కోర్సు చదువుతున్నాడు. లిథోనియాలోని ఒక స్టోర్‌లో క్లర్క్‌గా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల ఇల్లు లేని జూలియన్ ఫాల్క్‌నర్ అనే వ్యక్తి ఆ స్టోర్‌లోకి వచ్చాడు. బయట చలిగా ఉండటంతో వివేక్‌తోపాటు ఆ స్టోర్ సిబ్బంది అతడికి ఆశ్రయం ఇచ్చారు. రెండు రోజులు అక్కడ ఉన్న ఫాల్క్‌నర్‌కు చిప్స్, కోక్, తాగునీటితోపాటు వెచ్చదనం కోసం జాకెట్ కూడా ఇచ్చారు. ఆ వ్యక్తి వివేక్‌ను పలుమార్లు సిగరెట్లు అడిగి తీసుకున్నాడు.
జూలియన్ ఫాల్క్‌నర్ ఆ స్టోర్ నుంచి వెళ్లకుండా అక్కడే మకాం వేశాడు. ఈ నేపథ్యంలో జనవరి 16న స్టోర్ నుంచి వెళ్లాలని లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తానని వివేక్ అన్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లేందుకు అతడు సిద్ధమయ్యాడు. ఇంతలో జూలియన్ ఫాల్క్‌నర్ చేతిలోని సుత్తితో వివేక్ వద్దకు వచ్చి దాడి చేశాడు. అతడి తల, ముఖంపై సుమారు 50 సార్లు సుత్తితో కొట్టాడు. రక్తం మడుగుల్లో పడిన వివేక్ అక్కడికక్కడే చనిపోయాడు. మరోవైపు ఇది చూసి ఆ స్టోర్‌లోని మిగతా సిబ్బంది భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వివేక్ మృతదేహం వద్ద చేతిలో సుత్తితో ఉన్న జూలియన్ ఫాల్క్‌నర్‌ను అరెస్ట్ చేశారు. ఆ స్టోర్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
హర్యానాలోని బర్వాలాకు చెందిన వివేక్ సైనీ కుటుంబం అతడి హత్య గురించి తెలుసుకుని షాక్ అయ్యింది. చండీగఢ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన వివేక్ రెండేళ్ల కిందట అమెరికా వెళ్లినట్లు బంధువులు తెలిపారు. ఇటీవల అలబామా విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేసినట్లు చెప్పారు. వివేక్ మృతదేహం భారత్‌కు చేరుకున్నదని, అంత్యక్రియలు కూడా ముగిశాయని వారు వెల్లడించారు.